రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి లతో కలిసి ప్రజాపాలన గ్రామ,వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సన్నాహక ఏర్పాట్ల పై మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, తహశీల్దార్ లు, ఎంపిడివో లతో విడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని , డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతి మండలం పరిధిలో తహసిల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల చొప్పున పర్యటించి, ప్రతిరోజు ప్రతి బృందం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షెడ్యూల్లో గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు.
ప్రజాపాలన సభలలో పాల్గొనే సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.
మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ప్రతి గ్రామానికి దరఖాస్తులు ఒకరోజు ముందుగానే వస్తాయని, గ్రామ ప్రజలకు ముందుగానే దరఖాస్తులు అందించాలని, దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలోని నిరక్షరాస్యులకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు దరఖాస్తు నింపడంలో సహకరించేలా చూడాలని అన్నారు.
గ్రామసభల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలు అందించడం జరుగుతుందని, ప్రజాపాలన నిర్వహణపై మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించుకోవాలని, ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రజా పాలన సభ ఎప్పుడు నిర్వహిస్తున్నామనేది ప్రజలకు తెలియజేయాలని, మున్సిపాలిటీ లలో పారిశుద్ధ్య సిబ్బందిచే ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ప్రజాపాలన సభ నిర్వహణకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని త్రాగునీరు, టెంట్, కుర్చీలు, అవసరమైన బల్లలు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
మహిళలు , పురుషులు, వయో వృద్ధులు, వికలాంగులకు వేరు వేరు గా కౌంటర్ లు ఏర్పాటు చేయాలన్నారు.సాధ్యమైనన్ని ఎక్కువ కౌంటర్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఇతర అర్జీలకు జనరల్ కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు.ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించాలని, ఆధార్, రేషన్ కార్డు జత చేసేలా చూడాలని అన్నారు.
ప్రభుత్వం నుంచి దరఖాస్తు ఫారంలు అందిన వెంటనే మండలాలకు పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ప్రతిరోజు ప్రజాపాలన సభలలో తీసుకునే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.
ప్రతి ఒక్క దరఖాస్తును స్వీకరించాలని చెప్పారు.దరఖాస్తుదారునికి రసీదు అందించాలని, ప్రజాపాలన సభ నిర్వహణకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వారిని భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రజాపాలన సభల నిర్వహణకు ఇంచార్జి లను ఏర్పాటు చేయాలని, గ్రామ సభలలో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి, కౌంటర్లలో ఎవరు విధులు నిర్వహించాలని మొదలు కొని ప్రతి అంశం ప్రణాళిక బద్ధంగా జరిగేలా చూడాలని, సంబంధిత సిబ్బందికి ముందస్తుగానే విధులు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గ్రామ సభలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గ బాధ్యులుగా ఉన్న ఆర్డీఓ లు నియోజకవర్గ స్థాయిలో సంబంధిత అధికారులతో సమీక్షించి గ్రామసభ నిర్వహించే వేదికలలో సరిపడా మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు.ప్రతి వేదిక వద్ద ఆశా ను ఉంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేలా చూసుకోవాలన్నారు.
గ్రామ సభల నిర్వహణ ఏర్పాట్లకు అవసరమైన నిధులను విడుదల చేస్తామని చెప్పారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి మాట్లాడుతూ, మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని,దరఖాస్తుదారులు ముందస్తుగా దరఖాస్తు ఫారం నింపుకొని గ్రామ సభకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామసభ నిర్వహణపై డప్పు చాటింపు ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చే జారీ చేయనైనది.గ్రామసభలలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద క్యూలైన్ విధానం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కరోనా తిరిగి వ్యాపిస్తున్న దృష్ట్యా అర్జీదారులు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని చెప్పారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రజా పాలన సిఎం సందేశాన్ని ప్రజలకు చదివీ వినిపించాలన్నారు.గ్రామసభ నిర్వహించిన రోజు దరఖాస్తు దారుడు రాకున్నా జనవరి 6 వరకూ సంబంధిత గ్రామ పంచాయితీ సెక్రటరీ దరఖాస్తులు స్వీకరించాలన్నారు.
జిల్లా పంచాయితీ అధికారి రవీందర్ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రజాపాలన సభ నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.మున్సిపల్ కమిషనర్ లు, తహశీల్దార్ లు, ఎంపిడివో లు గ్రామం, వార్డు వారిగా కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
గ్రామాలలోని గ్రౌండ్ లు, రైతు వేదికలో ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.ప్రతిరోజు ఎన్ని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేశారు, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే రిపోర్టును రోజువారీగా తమకు పంపాలన్నారు.
ప్రజాపాలన గ్రామసభ నిర్వహించే ప్రదేశం, సమయం, వివరాలు ముందస్తుగా ప్రచారం చేయాలని, స్థానిక జడ్పిటిసి, ఎంపిటిసి సర్పంచ్, మొదలగు నాయకులకు తప్పనిసరిగా ఎంపీడీవో లేదా తహసిల్దార్ ఫోన్ ద్వారా సమాచారం అందజేయాలని అన్నారు.ఈ విడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, అదనపు ఎస్పీ చంద్రయ్య ,రెవెన్యూ డివిజన్ అధికారులు, ఆనంద్ కుమార్, మధు సూదన్ రెడ్డి, జెడ్పీ సి.ఈ.ఓ.గౌతమ్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి కొండల్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
.






