నిను వీడని నీడను నేనే అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ వెంట పడుతూనే ఉంది.మోడీ చదువుకు సంబంధించిన డిగ్రీల వివాదాన్ని ఇంకా సాగదీస్తూనే ఉంది.
ఆయన బియ్యే ,ఎమ్మే చదివారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సర్టిఫికెట్లు ప్రదర్శించినా ఆప్ నాయకులు నమ్మడంలేదు.అవి అసలు సర్టిఫికెట్లు కావని, బోగస్ అని ఘంటాపథంగా చెబుతున్నారు.
మోడీ చదువుకున్న వాడు కాదని నిరూపించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.మోడీ డిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ చేశారని చెబుతున్నారని, దీన్తో ఆ యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిందని డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు.
మోడీ సర్టిఫికెట్లు సరైనవా? కావా? అనేది తెలుసుకోవాలంటే యూనివర్సిటీ వీసీతో కలిసి వాటిని పరిశీలించాలని అభిప్రాయపడ్డారు.ఈ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చాలని సిసోడియా వీసీకి లేఖ రాశారు.
యూనివర్సిటీ అధికారులు నిజాలు దాస్తున్నారని ఆరోపించారు.మోడీ బియ్యే డిగ్రీని బహిర్గతం చేయడానికి వీసీ ప్రధాని అనుమతి తీసుకోవాలని కోరారు.
అయితే ఇందుకు మోడీ ఒప్పుకోరని సిసోడియా అన్నారు.డిల్లీ విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్న తాను వచ్చే వారం యూనివర్సిటీకి వస్తానని, మోడీ సర్టిఫికెట్లు పరిశీలిద్దామని, మీడియా సమావేశం పెట్టి నిజాలు చెబుదామని వీసీకి రాసిన లేఖలో కోరారు.
నిజానికి పాలకులకు ఎటువంటి విద్యార్హతలు ఉండాలో రాజ్యాంగంలో చెప్పలేదు.