ఎన్ని శిక్షలు వేసినా, ప్రాణాలు తీసినా దేశంలో అవినీతి, అక్రమాలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఆగవు.అందుకు ఉదాహరణ ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న శేషాచలం అడవులు.
గతంలో శేషాచలం అడవుల పేరు తెలియనివారికి కొంతకాలం కిందట అక్కడ ఎర్రచందనం దొంగలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం, అందులో ఇరవైమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తరువాత ఆ పేరు శాశ్వతంగా గుర్తుండిపోయింది.ఆ అడవుల్లో అంత పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది కాబట్టి ఇక ఎర్రచందనం రవాణా ఆగిపోవచ్చని, ఎర్ర దొంగలు, స్మగ్లర్లు భయపడి ఆ ఛాయలకు రారని చాలామంది అనుకొని ఉంటారు.
కాని అది కేవలం భ్రమ.ఎర్రచందనం కొల్లగొట్టేందుకు దొంగలు వస్తూనే ఉన్నారు.
శుక్రవారం ఉదయం ఒక ప్రయివేటు బస్సులో ఎర్రచందనం రవాణా చేస్తున్న డెబ్బయ్ నాలుగు మందిని పోలీసులు అరెస్టు చేశారు.ఎర్రచందనం రవాణా అవుతోందని సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు.
వీరంతా తమిళనాడులోని సేలం జిల్లాకు చెందినవారే.ఇరవైమందిని ఎన్‌కౌంటర్ చేసిన స్మగ్లింగ్ ఆగడంలేదంటే వీరు ఎంతకు తెగించారో అర్థమవుతోంది.