సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర విభజనపై నిత్యం విషం కక్కే బిజెపికి నేడు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం జరుపుకునే అర్హత లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం నందు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల పాలనలో మోడి తెలంగాణకు ఇచ్చిందేమి లేదని అన్నారు.
తెలంగాణ అమరుల త్యాగాలు,కెసిఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమాన్ని ఏనాడు బిజెపి నాయకులు గౌరవించలేదన్నారు,రాష్ట్ర విభజన సజావుగా సాగలేదని,పార్లమెంటులో తలుపులు మూసి విభజన చేశారంటూ ప్రధాని మోడితో పలువురు బిజెపి నాయకులు రాష్ట్ర విభజనను అవమానపరిచే విధంగా మాట్లాడించారని గుర్తు చేశారు.నేడు అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడే స్ధితిలో ఏ బిజెపి పాలిత రాష్ట్రం లేదని,బిజెపి 25 ఏళ్లుగా పరిపాలిస్తున్న గుజరాత్ అభివృద్ధిలో వెనకబడిపోయిందన్నారు.
తెలంగాణ మాదిరిగా నిరంతర విద్యుత్,సాగునీరు,మంచినీటి సరఫరా అందించే రాష్ట్రం మరొకటి లేదని తెలిపారు.మోడి ఎనిమిది ఏళ్ల పాలనలో 80 లక్షల అప్పులు చేసి ఆదాని,అంబాని వంటి పారిశ్రామిక వేత్తలను బాగుచేశారని,మోడి పాలనలో దేశ ప్రజలు పేదలు నరింత పేదలుగా మారిపోయారని,ప్రపంచ ఆకలి సూచిలో భారత్ పాకిస్తాన్,బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే వెనకబడి వుందని అన్నారు.
హైదరాబాదు నగరంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న మోడి,షాలు హైదరాబాదు అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని సూచించారు.కానీ,బిజెపి నాయకులు హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఈర్ష్య అసూయలతో కుట్రలు చేస్తున్నారని అన్నారు.
అమిత్ షా చేసే కొంగ జపం చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెదిందని అన్నారు.
కృష్ణా,గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో,బచావత్ ట్రిబ్యునల్ అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు.