ఈనెల మూడు నాలుగు తారీకులలో విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమానికి దాదాపు 25 దేశాల నుంచి ప్రముఖులు వస్తున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
అంతేకాదు ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా, కరణ్ ఆదాని…లాంటి కుబేరులు కూడా హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు.రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో అత్యధిక పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
దేశంలో ఎక్కడా లేనంతగా 70 శాతం స్కిల్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రానికి విశాఖ నగరం భవిష్యత్తుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. 25 దేశాల ప్రముఖులతో పాటు దేశంలో దిగ్గజ వ్యాపార కుబేరులకు నగరంలో వివిధ హోటల్స్ నందు బస ఏర్పాటు చేసినట్లు మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.ఈ సదస్సుకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు.ఈ క్రమంలో 25 ప్రత్యేక విమానాలు విశాఖకు రాబోతున్నాయని.18 విమానాలను విశాఖ విమానాశ్రయంలో పార్క్ చేసే అవకాశం ఉందని అన్నారు.మిగిలిన విమానాలు రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు తరలించనున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం రాత్రి 8 గంటలకు విశాఖ చేరుకుంటారని పేర్కొన్నారు.మూడవ తారీకు ఉదయం ఆయన వేదిక వద్దకు వచ్చి ఎగ్జిబిషన్ ని తిలకిస్తారని ఆ తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తారని స్పష్టం చేశారు.రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.







