విహార యాత్ర విషాద యాత్రగా మారి దుబాయ్‌లోని భారతీయ కుటుంబంలో తీరాన్ని దుఖాన్ని మిగిల్చింది.నీట మునిగిన కుమార్తెను కాపాడేయత్నంలో తండ్రి కూడా జల సమాధి అయ్యాడు.
వివరాల్లోకి వెళితే… కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన 47 ఏళ్ల ఇస్మాయిల్ చందంకండియిల్ కుటుంబం యూఏఈలో నివసిస్తోంది.ఆయన గత 14 ఏళ్లుగా దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (ఆర్‌టీఏ)లోని టెక్నికల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన భార్య నఫీసా, కుమార్తె అమల్‌తో కలిసి బుధవారం సాయంత్రం అజ్మాన్ బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు.అలల్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ అమల్ నీటిలో కొట్టుకుపోయింది.
ఇది గమనించిన ఆయన బిడ్డను కాపాడేందుకు సముద్రంలోకి దూకి అలల తాకిడికి మునిగిపోయారు.వీరిని కాపాడాల్సిందిగా కుటుంబసభ్యులు కేకలు పెట్టారు.
ఈలోగానే తండ్రి, కూతుళ్లు ఒడ్డుకు కొట్టుకువచ్చారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే వారిద్దరూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.వీరి మరణవార్తతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అటు స్వగ్రామం కోజికోడ్‌లో సైతం విషాద ఛాయలు అలుముకున్నాయి.

కాగా, ఇటీవలి కాలంలో విదేశాల్లో విహారయాత్రల సందర్భంగా భారతీయులు మరణిస్తున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.కొద్దినెలల క్రితం అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి ఒకరు దుర్మరణం చెందారు.కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతుల కుమార్తె కమల కొలంబియాలో ఉంటున్నారు.
అట్లాంటా సమీపంలోని జలపాతంలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందిన ఘటన తెలిసిందే.