మనం వాడే మందులకు కాల పరిమితి ఉంటుంది.కాలం తీరిన మందులు వాడితే ప్రమాదం.
అలాగే కొన్ని సిద్ధాంతాలను కూడా ప్రజలు తిరస్కరించడంతో కాలం తీరిపోతున్నాయి.కొన్ని పార్టీలు కూడా కాలక్రమంలో అదృశ్యమవుతున్నాయి.
అలా అదృశ్యం అవుతున్న పార్టీల జాబితాలో గులాబీ పార్టీ కూడా చేరబోతోందా? బీఆర్ఎస్ గా మారబోతున్న టీఆర్ఎస్ ఆయువు తీరిపోతుందా ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళయింది.ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు గాని…తర్వాత ప్రకటించిన పథకాలు గాని వేటినీ కేసీఆర్ సరిగా అమలు చేయలేదు.
పైగా దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలు కేసీఆర్ తీరును వెక్కిరిస్తున్నాయి.ఇంకా అనేక పథకాలు, కార్యక్రమాలు అడుగు ముందుకు.మూడడుగులు వెనక్కి అన్నట్లుగా మారాయి.ఒక రాష్ట్రాన్నే సరిగా పాలించలేకపోతున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ రాజకీయాలను తాను చూపిస్తానని, సరైన దిశ, దశ దేశానికి చూపిస్తానని గులాబీ దళపతి చెబుతున్నారు.
ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కేసీఆర్ కు ఆప్తుడయ్యారు.
నియోజకవర్గాల్లో ప్రశాంత్ టీమ్ చేసిన సర్వేతో గులాబీ దళపతిలో ఆలోచన మొదలైంది.సగానికిపైగా ఎమ్మెల్యేల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు స్పష్టం కావడంతో పార్టీని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు కేసీఆర్.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పార్టీని స్థాపించి జాతీయ రాజకీయాలను మార్చాలని కేసీఆర్ అనుకుంటున్నారు.ఇదంతా ప్రశాంత్ సూచనలు, సలహాల మేరకే జరుగుతోంది.

దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ జాతీయ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీలు పాతుకుపోయిన్నాయి.కేజ్రీవాల్ ఆప్ పార్టీ ఢిల్లీతో పాటు పంజాబ్ లో కూడా అధికారం పొందింది.మహారాష్ట్రలో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, బెంగాల్లో మమతాబెనర్జీ నాయకత్వంలోని ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచనలు బలంగా చేస్తున్నాయి.అలాగే దక్షిణాదిన కర్నాటకలో కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్ పార్టీలు పాతుకుపోయాయి.
తమిళనాడులో రెండు ద్రావిడ పార్టీలదే హవా.ఇక కేరళలో కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులే తప్ప బీజేపీకి కూడా అవకాశం ఇవ్వడం లేదు.ఇంక కేసీఆర్ రాజకీయాలు చేయడానికి మిగిలి ఉన్న రాష్ట్రాలెక్కడ ఉన్నాయి?
.







