కర్ర విరగకుండా, పాము చావకుండా కేంద్ర అధికార పార్టీ బిజెపి వ్యవహారాలు చేస్తోంది.ఏపీలో ఆ పార్టీకి పెద్ద బలం లేకపోయినా, బలమైన అధికార పార్టీ వైసీపీ ని ఒక ఆట ఆడిస్తోంది.
ఒకపక్క వైసిపి ద్వారా భారీగా లబ్ధి పొందుతూనే, కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులకు వైసీపీ ఎంపీల మద్దతు తీసుకుంటూనే, మరోవైపు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తోంది.ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, చెప్పుకుంటూ వెళితే చాలా అంశాలే బిజెపి కారణంగా వైసిపికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి.
అయినా, కేంద్రంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా జగన్ సర్దుకుపోతూ వస్తున్నారు.బీజేపీ మాత్రం ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ వస్తోంది.

వైసిపి అధికారంలోకి వచ్చిన మొదట్లో జగన్ కు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్టు గానే బిజెపి పెద్దలు వ్యవహరించేవారు.ఆ మేరకు జగన్ కు ప్రాధాన్యం ఇచ్చేవారు .అయితే ఇప్పుడు వైసిపి తమకు రాజకీయ బద్ధశత్రువు అని బహిరంగంగానే ప్రకటిస్తూ, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు.వైసీపీ విషయంలోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అంటే టిడిపి ప్రభుత్వం లోనూ ఇదే విధమైన వైఖరితో బీజేపీ పెద్దలు వ్యవహరించారు.
మొదట్లో టీడీపీతో సన్నిహితంగా మెలగడం తో పాటు, ఆ పార్టీకి క్యాబినెట్ల మంత్రి పదవులను కట్టబెట్టారు.ఇక ఆ తర్వాత బిజెపి, టిడిపి కి మధ్య వైరం బాగా ముదిరిపోవడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

ఎన్నికల వరకు ఇదే తంతు కొనసాగింది.అయితే ఇప్పుడు వైసిపి ఏపీలో బలంగా తయారవడం, టిడిపి బలహీనం అవుతుండడంతో చేసేదిలేక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో ఏపీ లోని అన్ని పార్టీలకు తామే దిక్కు అనే అభిప్రాయం బిజెపి పెద్దల్లో వ్యక్తం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.పోనీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన విషయంలో స్పష్టమైన క్లారిటీతో ఉన్నారా అంటే అక్కడా ఇదే పరిస్థితి.
ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తప్ప, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా జనసేన, బీజేపీలు కలిసి పోరాటం చేయడం లేదు.అసలు ఆ పార్టీ తో సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తూ బిజెపి వస్తోంది.
ఏపీలో అన్ని పార్టీల కంటే బలహీనంగా ఉన్న బిజెపి పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఏపీలో ప్రధానంగా ఉన్న వైసిపి టిడిపి జనసేన పార్టీలను బిజెపి తమ గుప్పిట్లో పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తూ రాజకీయం చేస్తుండడం ఒకపక్క ఆయా పార్టీల నేతలకు కాక రేపుతున్నా, కేంద్ర అధికార పార్టీ కావడంతో సైలెంట్ గా ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.