తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు అన్నది చాలా సర్వ సాధారణం.కాని ఇప్పుడు ఈ వర్గ పోరు తారా స్థాయికి చేరిందని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పటికే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే పార్టీ నిర్ణయాన్ని, పీసీసీ చీఫ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉండగా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లాంటి నేతలు మౌనం వహిస్తూ కాంగ్రెస్ కార్యక్రమాలకు అంటీముట్టనట్టు ఉంటున్న పరిస్థితి ఉంది.ఇక ఇది ఒక వైపు ఉంటే అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో ముసలం రేగడంతో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు ఎప్పటి నుండో నడుస్తోంది.

జిల్లాలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో పాత వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో ఎప్పటి నుండో అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ను బ్రతికిస్తున్న ప్రేమ్ సాగర్ రావు మనస్తాపం చెందారు.దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా సాజిద్ ఖాన్ ను మార్చాలని, అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని ప్రేమ్ సాగర్ రావు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.దీంతో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ లు అయిన జగ్గారెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు కూడా పార్టీలో తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందంటూ పార్టీ వ్యతిరేక గళం వినిపిస్తున్న నేపథ్యంలో రేవంత్ వర్గం ఒకవైపు, సీనియర్ ల వర్గం ఒకవైపు చీలిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.వీలైనంత తొందరగా రేవంత్ రెడ్డి ఈ సమస్యలను పరిష్కరించక పోతే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారే అవకాశం ఉంది.