వృత్తి, ఉద్యోగ వ్యాపారాల కోసం అమెరికా వెళ్లిన భారత సంతతి వ్యక్తులు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తున్న సంగతి తెలిసిందే.డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇండో అమెరికన్ వ్యోమగామి రాజాచారి అరుదైన ఘనత దక్కించుకున్నారు.అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన తొలి భారత సంతతి వ్యోమగామిగా ఆయన రికార్డులకెక్కారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి బయటకొచ్చిన ఆయన రోదసిలో సంచరించారు.ఈ క్రమంలో ఆరున్నర గంటలకు పైగా అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేశారు.
భారత కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫ్లైట్ ఇంజనీర్ కైలా బారన్‌తో కలిసి రాజాచారి ఈ ఘనత సాధించారు.వీరిద్దరూ ఐఎస్ఎస్ నుంచి బయటకొచ్చి స్పేస్ స్టేషన్ స్టార్ బోర్డు-4 ట్రస్ వద్దకు చేరుకుని ఇప్పటికే ఉన్న సోలార్ ప్యానళ్ల స్థానంలో కొత్త ప్యానళ్లను అమర్చారు.
అలా దాదాపు ఆరు ‘ఐఎస్ఎస్ రోల్ ఔట్ సోలార్ ఆరే (ఐఆర్‌ఓఎస్ఏ)’లను రిప్లేస్ చేశారు.
వీరిద్దరికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోపలి నుంచి థామస్ మార్ష్‌బర్న్, మథీయాస్ మౌరర్ అనే మరో ఇద్దరు వ్యోమగాములు దిశానిర్దేశం చేశారు.
స్పేస్ స్టేషన్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఈ ప్రయోగం చేపట్టింది.ఐఎస్ఎస్‌కు ప్రస్తుతం 160 కిలో వాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండగా కొత్త ప్యానళ్ల అమరిక తర్వాత ఇది 215 కిలోవాట్లకు పెరగనుంది.
రాజాచారికి కెరీర్‌లో ఇది తొలి స్పేస్ వాక్ కాగా… బారన్‌కు రెండోది.ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ క్రూ-3 మిషన్‌కు 2020లో కమాండర్‌గా ఎంపికైన రాజాచారి గత ఏడాది నవంబర్‌లో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఐఎస్ఎస్‌కు వెళ్లారు.

ఎవరీ రాజాచారి:
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాజా చారి శిక్షణ పొందారు.యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లో శిక్షణ పొందిన ఏకైక భారత సంతతి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాసుల కోసం నాసా అతన్ని 2017లో ఎంపిక చేసింది.కఠిన శిక్షణను పూర్తి చేసుకున్న రాజాచారి మూన్ మిషన్‌కు కూడా అర్హత సాధించినట్లు గతంలోనే నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే.
నాసా 2024లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు ఎంపికైన వ్యోమగాముల్లో ఆయన కూడా ఒకరు.
మిల్వాకీలో జన్మించిన రాజాచారి తండ్రి భారతీయుడు కాగా, తల్లి అమెరికన్.ఆయన బాల్యం తల్లి స్వగ్రామం అయోవాలోని సెడార్ ఫాల్స్‌లోనే గడిచింది.యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో కల్నల్ స్థాయికి చేరిన రాజా చారికి టెస్ట్ పైలట్‌గా విశేషమైన అనుభవం వుంది.
ఎఫ్ 35, ఎఫ్ 15, ఎఫ్ 16, ఎఫ్ 18లో 2,500 గంటల పాటు విమానయానం చేసిన అనుభవం ఆయన సొంతం.ఇరాక్ యుద్ధంతో పాటు కొరియా ద్వీపకల్పంలోనూ రాజాచారి అమెరికా వాయుసేన తరపున సేవలందించారు.
మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు.అనంతరం మేరీల్యాండ్‌లోని పటుక్సెంట్ నదిలో యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్, కాన్సాస్‌లోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలోనూ శిక్షణ పూర్తి చేసుకున్నారు.







