తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.ఉద్యమ కాలం నుంచి పనిచేసిన చాలామందికి ఇప్పటికీ పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ , కీలకమైన నామినేటెడ్ పదవులను కేసీఆర్ కట్టబెడుతున్నారు తప్ప, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ రెండుసార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలా చేసిన తమను ఏ మాత్రం పట్టించుకోకుండా , కొత్తగా చేరే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడం పై రగిలిపోతున్నారు.అయితే మొదట్లో కేసీఆర్ వైఖరి ఉన్నట్లుగా ఇప్పుడు లేకపోవడం , ఇప్పుడు అందరినీ కలుపుకుని వెళ్లే విధంగా ప్రయత్నించడంతో పాటు కీలకమైన పదవులు కట్టబెడుతూ వస్తున్నారు.
ఉద్యమ కాలం నుంచి పనిచేస్తూ వస్తున్న వారికి కీలకమైన పదవులను అప్పగిస్తూ ఉండడం, త్వరలోనే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరికీ సరైన ప్రాధాన్యం కల్పిస్తూ ఉండడంతో, ఇప్పుడు నామినేటెడ్ పదవి పై ఆశలు పెట్టుకున్న వారంతా టీఆర్ఎస్ కీలక నాయకులు చుట్టూ తిరుగుతూ, తాము ఉద్యమ కాలం నుంచి ఏ విధంగా పని చేస్తున్నామో అనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

అంతేకాదు పార్టీ కార్యక్రమాలలో తాము పాల్గొన్న ఫోటో ఆల్బమ్ ను సైతం చూపిస్తూ, తమకు కీలకమైన పదవులు దక్కేలా చేయాలని టీఆర్ఎస్ కీలక నాయకులను వేడుకుంటున్నారు.తెలంగాణలో పెద్దఎత్తున నామినేటెడ్ పోస్టుల భర్తీకి టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే రాష్ట్రంలో దాదాపు 90 కార్పొరేషన్లలో 13 కార్పొరేషన్ లకు ఛైర్మన్ లను నియమించింది.
అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి సరైన ప్రాధాన్యం ఇస్తామని సంకేతాలను ఇచ్చింది.దీంతో టీఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో పడేందుకు నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఈ నామినేటెడ్ పదవుల అంశంపైనే ఎక్కువగా పార్టీ నాయకులు దృష్టి సారించారు.