కేరళకు చెందిన 15 నెలల చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది.ఈ చిన్నారి తల్లిదండ్రులు సారంగ్ మీనన్, అదితి నాయర్ చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ కోసం అభ్యర్థించాలని నిర్ణయించుకున్నారు.
ఆ చిన్నారి పేరు నిర్వాణ. ఈ సంవత్సరం జనవరిలో ఆచిన్నారికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.అయితే తన పేరు చెప్పకుండానే ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ చిన్నారి చికిత్స నిమిత్తం రూ.11 కోట్లు విరాళంగా ఇవ్వడంతో ఆ దంపతులు చాలా ఆశ్చర్యపోయారు.సారంగ్ మీనన్ మరియు అదితి నాయర్ కేరళలోని పాలక్కాడ్ నివాసితులు.కానీ ముంబైలో నివసిస్తున్నారు.ఆ చిన్నారి చికిత్సకు దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని సమాచారం.నోవార్టిస్ (ఫార్మాస్యూటికల్ కంపెనీ) నుండి వచ్చిన జోల్జెన్స్మా ఈ వ్యాధికి ఒక సారి వినియోగించే ఔషధం.

వీరికి డబ్బు ఎలా వచ్చింది?
వారు క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించగా, ఫిబ్రవరి 19 వరకు వారి ఖాతాలో రూ.5.42 కోట్లు జమయ్యాయి.ఫిబ్రవరి 20న తనపేరు తెలియనివ్వని ఒక దాత తమ నిర్వాణ చికిత్స కోసం తమ ఖాతాలో $1.4 మిలియన్లను జమ చేసినట్లు కుటుంబం వారి ఫేస్‌బుక్ పేజీలో ప్రకటించింది.ఇప్పటి వరకు అజ్ఞాత వ్యక్తి విరాళం సహా మొత్తం 72 వేల మంది నిర్వాణ చికిత్స కోసం విరాళాలు అందించారు.
సారంగ్, అదితి దంపతులు ఆ అపరిచితుడికి కృతజ్ఞతలు తెలిపారు మరియు ఇప్పుడు చికిత్స ఖర్చులకు కేవలం 80 లక్షలు మాత్రమే అవసరమని చెప్పారు.దీంతో పాటు తన బిడ్డకు అవసరమైన మందులపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర మంత్రి వీణా జార్జ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిశారు.

ధన్యవాదాలు తెలిపన తండ్రి
నిర్వాణ తండ్రి సారంగ్ మీడియాతో మాట్లాడుతూ అకస్మాత్తుగా ఇంత డబ్బు ఎవరు ఇచ్చారో మాకు తెలియదు, ఇది మాకు అద్భుతంలాఉంది.ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించిన మిలాప్ సంస్థను సంప్రదించగా, దాత తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదని వారు చెప్పారు.ఎస్ఎంఏ అనేది మోటారు న్యూరాన్‌ల క్షీణత వల్ల వచ్చే జన్యుపరమైన వ్యాధి.దాని వల్ల కండరాలు బలహీనంగా మారి, శరీరం యొక్క పెరుగుదల వేగం మందగిస్తుంది.ఈ వ్యాధి వల్ల రోజువారీ కార్యకలాపాలు అంటే శ్వాస తీసుకోవడం మరియు ఆహారం మింగడం చాలా కష్టంగా మారుతుంది.సకాలంలో చికిత్స చేయకపోతే, బాధితుడు మరణిస్తాడు.
బాధితురాలి తల్లిదండ్రులు ప్రపంచంలో మానవత్వం ఇంకా బతికే ఉందన్నారు.ప్రపంచంలోని ఏదో ఒక మూలన కూర్చున్న వ్యక్తి తమ బిడ్డ కోసం ఇలా సాయం చేయడం చాలా ఆనందంగా ఉంది.
ఆ వ్యక్తి ఎవరైనా సరే తమకు దేవుడిలాంటివాడని వారు అంటున్నారు.







