సాధారణంగా పెళ్లి వేడుకలో మర్యాదలు తక్కువయ్యాయని బంధువులు గొడవకు దిగడం మనం చూస్తుంటాం.కానీ ఓ పెళ్లి వేడుకలో భోజనం విషయంలో చెలరేగిన వివాదం కాస్త పెద్ద గొడవకు దారి తీసింది.
శ్రీకాకుళం జిల్లాలోని సారవకోట మండల కేంద్రంలోని రెల్లివీధిలో జరిగిన ఓ పెళ్లి వేడుక రక్తసిక్తంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, పెళ్లి భోజనాల వద్ద చికెన్ కూర కోసం వధువు, వరుడు బంధువులు గొడవకు దిగారు.
రెల్లివీధికి చెందిన కూన సురేష్ అనే యువకుడికి బూర్జ మండలం ఉప్పినివలస గ్రామానికి చెందిన సవలాపురం నందినితో బుధవారం వివాహం జరగాల్సి ఉంది.ఈ క్రమంలో ఏర్పాటు చేసిన భోజనం విందులో తనకు చికెన్ కూర తక్కువగా వేశారని, మళ్లీ వేయాల్సిందిగా అమ్మాయి తరఫు బంధువు ఒకరు గొడవకు దిగారు.
కాగా చికెన్ కూర తక్కువగా ఉండటం, అప్పటికే అతడి ప్లేట్‌లో చికెన్ కూర ఉండటంతో, ముందు ఉన్న కూర తినాలని భోజనం వడ్డించే వారు అన్నారు.
దీంతో అమ్మాయి తరఫు వాళ్లు గొడవకు దిగడంతో ఇరువర్గాల వారు కర్రలతో కొట్టుకున్నారు.
ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు.
ఇరు వర్గాల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.







