ఇటీవల కాలంలో పెంపుడు కుక్కలను ఇతరులను కరుస్తున్న ఘటనలు పెరిగాయి.ప్రభుత్వం హెచ్చరించినా కుక్కల యజమానులు తమ తీరు మార్చుకోలేదు.
దీంతో ఈ అంశం తీవ్రమైనదిగా ప్రభుత్వం భావించింది.ఈ క్రమంలో గురుగ్రామ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక కీలక ఆదేశాలు జారీ చేసింది.11 విదేశీ కుక్కల జాతులను నిషేధించాలని, వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.వాటిని అదుపులోకి తీసుకుని, పౌండ్లలో ఉంచాలని మున్సిపల్ కార్పొరేషన్ గురుగ్రామ్ (MCG)ని ఆదేశించింది.
అంతేకాకుండా ఆగస్టు 11న సివిల్ లైన్స్‌లో పెంపుడు కుక్క కాటుకు గురై తీవ్రంగా గాయపడిన మహిళకు తాత్కాలిక ఉపశమనంగా రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.మొత్తం 11 జాతుల కుక్కలపై గురుగ్రామ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక నిషేధాన్ని విధించింది.పెంపుడు కుక్కల కోసం మూడు నెలల్లో పాలసీని రూపొందించాలని ఎంసిజిని ఫోరం ఆదేశించింది.
నిషేధించబడిన 11 కుక్క జాతులలో అమెరికన్ బుల్‌డాగ్, అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో,

రోట్‌వీల్లర్, బోయర్‌బోయెల్, ప్రెస్ కానరియో, నియాపోలిషియన్ మాస్టిఫ్, వోల్ఫ్‌డాగ్, కేన్ కోర్సో, బాండోగ్ మరియు ఫిలా బ్రసిలీరో. ఇవన్నీ “ప్రమాదకరమైన విదేశీ జాతులు”గా వినియోగదారుల ఫోరం పేర్కొంది.ఈ జాతులకు చెందిన పెంపుడు కుక్కలను ఎవరైనా యజమానులు కలిగి ఉంటే వాటిని గురుగ్రామ్ కార్పొరేషన్‌కు సరెండర్ చేయాలని ఆదేశించింది.
ఒక కుటుంబం ఒకే కుక్కను మాత్రమే ఉంచుకోవాలని, రిజిస్టర్డ్ కుక్కను బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లినప్పుడల్లా, దాని నోటిని నెట్ క్యాప్ లేదా మరేదైనా సరిగ్గా కప్పి ఉంచాలని సూచించింది.







