మహాత్మా జ్యోతిరావ్ గోవింద్ రావ్ పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఘనంగా నివాళులర్పించారు.సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతి కారుడు పూలే అని సీఎం స్మరించుకున్నారు.
పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా పూలే అని సీఎం కొనియాడారు.
సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన దార్శనికులు మహాత్మా జ్యోతిరావ్ గోవింద్ రావ్ పూలే.దళిత, బహుజన జనోద్ధరణ కోసం జీవితకాలం పూలే చేసిన కృషి భారత సమాజంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిందన్నారు.
మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని సీఎం తెలిపారు.
సబ్బండవర్ణాల సాధికారత, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
వెనకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన పూలే బాటను అనుసరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ‘మహాత్మా జ్యోతిబా పూలే బిసి సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ’ను ఏర్పాటు చేసిందన్నారు.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పూలే పేరుతో బీసీ గురుకుల విద్యాలయాలు నెలకొల్పిందన్నారు.
తన సహచరి సావిత్రి బాయి పూలే కు విద్యాబుద్దులు నేర్పి దేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలిని చేసి స్త్రీ విద్యకు బాటలు వేసిన ఘనత పూలేకు దక్కుతుందన్నారు.పూలే బాటలోనే, బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిందన్నారు.
దేశంలోనే ప్ర ప్రథమంగా మహిళా విశ్వ విద్యాలయాన్ని స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
బలహీన వర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి ‘పూలే బి.సి.విదేశీ విద్యా నిధి’ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నదన్నారు.బహుజనుల కోసం ప్రత్యేకంగా ఆత్మ గౌరవ భవనాలను నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు.
సబ్బండ వృత్తుల వారీగా ప్రోత్సాహకాలు అందిస్తూ.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు.తద్వారా బడుగు, బలహీన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని సీఎం అన్నారు.పూలే ఆశయ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వ కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.