నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం ఏడు స్థానాలకు గాను ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తమకు బలం సరిపోదు అని తెలిసినా టిడిపి తమ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ( Panchumurti Anuradha )ను పోటీకి దించింది.
అనూహ్యంగా ఈ ఎన్నికల్లో అనురాధ విజయం సాధించారు.ఏడు స్థానాల్లో ఆరు స్థానాలను వైసిపి గెలుచుకోగా, ఒక్క స్థానంలో 23 ఓట్లతో అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందారు.
వైసిపి నుంచి రెండు ఓట్లు టిడిపి అభ్యర్థికి పడినట్లుగా తేలింది.దీంతో టీడీపీకి అనుకూలంగా ఓటు వేసిన వైసిపి అభ్యర్థులు ఎవరనే విషయంపై ఆ పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది.
ఈ నేపథ్యంలోనే తెరపైకి రెండు పేర్లు వచ్చాయి.ఇటీవల వైసిపి నుంచి సస్పెండ్ అయిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( MLA Kotamreddy Sridhar Reddy ), వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి( Anam Ramanarayana Reddy ) కాకుండా మరో ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపికి అనుకూలంగా ఓటు వేశారు.
మొత్తంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపికి అనుకూలంగా ఓటు వేయడంతోనే పంచుమర్తి అనురాధ విజయాన్ని నమోదు చేసుకున్నారు.

ఇక టిడిపికి అనుకూలంగా ఓటు వేసినట్లుగా అనుమానిస్తున్న వారి జాబితాలో గుంటూరు జిల్లా, తాడికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఆమెతోపాటు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు మొదట వినిపించినా, తాజాగా కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. శ్రీదేవి మధుసూదన్ ఇద్దరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉండవచ్చు అని వైసిపి అధిష్టానం అనుమానిస్తోంది.
తాజాగా ఈ వ్యవహారం పై ఉండవల్లి శ్రీదేవి, బుర్ర మధుసూధన్ స్పందించారు.తాము క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు.తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేయాల్సిన అవసరం తమకు లేదని, ఎమ్మెల్సి ఎన్నికల ప్రక్రియ రహస్య ఓటింగ్ పద్ధతిలో జరిగిందని , అటువంటప్పుడు తమ పేర్లను ఏ విధంగా చెప్తారు అంటూ శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న ఉదయమే తన కుమార్తె తో కలిసి సీఎం జగన్ ను కలిశాను అని, తనకు ఇచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేశానని శ్రీదేవి అన్నారు.క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.దళిత మహిళను కాబట్టే చులకన గా, చిన్న చూపు చూస్తున్నారు అంటూ శ్రీదేవి అన్నారు.
జగన్ తనను ఆదరించినప్పుడు ఆయనకు గాని, పార్టీకి గాని ద్రోహం చేయాల్సిన అవసరం తనకు లేదని శ్రీదేవి క్లారిటీ ఇచ్చారు.ఇక ఇదే తరహాలో విమర్శలు ఎదుర్కొంటున్న బుర్ర మధుసూదన్ కూడా దీనిపై స్పందించారు.
ఎవరో ప్రలోభ పెడితే దానికి లోంగిపోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.మొత్తంగా ఈ వ్యవహారంపై వైసీపీ లో పెద్ద కల్లోలమే చోటు చేసుకుంది.







