తరాలు మారుతున్నా అంజలి శనివారం పంచాయతీకి రహదారి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆ పంచాయతీ ప్రజానీకం గగ్గోలు పెడుతుంది.వివరాల్లోకి వెళితే మండలంలోని మారుమూల పంచాయతీ కేంద్రమైన అంజలి శనివారం గ్రామానికి నేటికీ సరైన రహదారి సౌకర్యం లేదని ఆ పంచాయతీ పరిధిలోని సుమారు 32 గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంటే, తమ గ్రామం మాత్రం ఎటువంటి సౌకర్యాలకు నోచుకోలేక పోతుందని అంజలి శనివారం పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు, పంచాయతీ సర్పంచ్ పేట్ల రాజబాబు మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు పూర్తిచేసుకుని ఎనిమిదవ దశాబ్దానికి చేరువ కావస్తున్నా తమ పంచాయతీ కి మాత్రం నేటికీ సరైన రహదారి సౌకర్యం లేదని, అత్యవసర పరిస్థితుల్లోనూ, వర్షా కాలంలో కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉందని అన్నారు.
ఎన్నో ప్రభుత్వాలు మారినా రహదారి నిర్మాణంలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా అత్యవసర సమయంలో అంబులెన్స్ కు సమాచారం ఇవ్వాలన్నా అందుబాటులో సమాచార వ్యవస్థ (సెల్ సంకేతాలు) లేక సుమారు 5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి సమాచారం ఇవ్వాల్సి వస్తుందని, కాబట్టి తమ పంచాయతీ పరిధిలో ఒక సెల్ టవర్ ను ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నామన్నారు.
అనంతరం పంచాయతీ కార్యదర్శి జి అప్పారావు మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలోని 32 గ్రామాలలో వివిధ తెగల వారు జీవనం సాగిస్తున్నారని, నేటి ప్రభుత్వం హయాంలో వివిధ సర్వేల ద్వారా ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరవేయాల్సి ఉండగా, ఈ ప్రాంతంలో అంతర్జాల సేవలు అందుబాటులో లేక గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారని అన్నారు.
లబ్ధిదారుల వేలిముద్రల నిమిత్తం లబ్ధిదారులను కొండలు, గుట్టల వెంట సెల్ సంకేతాలు ఉన్న ప్రాంతానికి తిప్పాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతానికి సెల్ టవర్ ను మంజూరు చేసినట్లయితే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు, సర్వేలను వేగవంతంగా పూర్తి చేసేందుకు దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్, కార్యదర్శులతో పాటు సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు…