ఆంధ్రప్రదేశ్‌లో కొత్త చరిత్ర ప్రారంభమైంది.మనిషికి గుండె ఎటువంటిదో దేశానికిగాని, రాష్ర్టానికిగాని రాజధాని అటువంటిది.
రాజుల కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు శత్రువులు రాజధానిని స్వాధీనం చేసుకుంటే ఆ రాజ్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లే లెక్క.అందుకే రాజధానికి అంత ప్రాధాన్యత.
ఇప్పుడు అందరి చూపూ ఏపీ రాజధాని అమరావతి పైనే ఉంది.దాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాస్ర్తోక్తంగా, సంప్రదాయబద్ధంగా శనివారం శంకుస్థాపన చేశారు.
అసలు నిర్మాణం కొంతకాలం తరువాత ప్రారంభమవుతుంది.స్వతంత్ర భారతంలో మరో రాజధాని నగర నిర్మాణం కాబోతున్నది.
తెలంగాణకు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్ నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.దాంతో పోల్చినప్పుడు ఏపీ రాజధానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
అందులోనూ చంద్రబాబు దీనిపై ఎంతో గొప్పగా చెబుతున్నారు.ఆయన చెప్పేదాన్ని బట్టి ఆధునిక భారతదేశంలో అమరావతి అత్యంత అధునాతన రాజధాని నగరంగా అవతరించవచ్చు.
అదే జరిగితే దేశానికే ఇది ఆదర్శంగా నిలుస్తుంది.దీని నిర్మాణం పూర్తయ్యేసరికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం.
కాని అనుకున్న విధంగా నగరాన్ని నిర్మిస్తే బాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది.తెలుగువారికి హైదరాబాద్ చారిత్రక ప్రాధాన్యమున్న రాజధాని అయితే, అమరావతి ఆధునిక చరిత్రను ప్రారంభించిన రాజధాని అవుతుంది.







