ఉద్యోగం ఇంటర్వ్యూకి ఆలస్యంగా వెళ్తే బ్యాడ్ ఇంప్రెషన్( Bad impression ) పడుతుంది అందరికీ తెలిసిందే.కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి కాస్త ముందే వెళ్తే ఉద్యోగమే పోగొట్టుకున్నాడు.
అంతేకాదు, ఈ విషయం ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది.అసలు విషయం ఏంటంటే, ఒక అభ్యర్థి ఉద్యోగం ఇంటర్వ్యూకి ఏకంగా 25 నిమిషాలు ముందుగా వచ్చాడట.
కారణం ఏంటంటే, ఆ ఎంప్లాయర్ మాత్రం అతను అంత ముందుగా రావడం సరైన నిర్ణయం కాదని భావించాడు.దాంతో అతనికి ఆ ఉద్యోగం ఇవ్వలేదు.

ఈ వింత కథని అట్లాంటాలోని ( Atlanta )ఒక క్లీనింగ్ బిజినెస్ యజమాని మాథ్యూ ప్రీవెట్ లింక్డ్‌ఇన్‌లో ( Matthew Prewett on LinkedIn )పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.“గత వారం మా ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ పోస్టు కోసం ఒక అభ్యర్థి ఇంటర్వ్యూకి 25 నిమిషాలు ముందు వచ్చాడు.నిజం చెప్పాలంటే, అతన్ని ఉద్యోగానికి తీసుకోకపోవడానికి ఇది ఒక ముఖ్య కారణం,” అని ఆయన రాసుకొచ్చారు.ప్రీవెట్ తన కారణాలను వివరంగా చెప్పారు.సాధారణంగా ముందుగా రావడం మంచిదే కానీ, మరీ ఎక్కువ ముందుగా రావడం సమస్య అని ఆయన అన్నారు.దానివల్ల తనకు హడావిడిగా, అసౌకర్యంగా అనిపించిందని చెప్పారు.
ఆయనది చిన్న ఆఫీసు కావడంతో, అభ్యర్థి తన బిజినెస్ కాల్స్ వినిపించేంత దగ్గరలో వేచి ఉండాల్సి వచ్చిందట.

అభ్యర్థి దూరం నుంచి రాలేదని కూడా ప్రీవెట్ అన్నారు.ఇంత ముందుగా రావడం సమయ పాలన లేకపోవడమో లేదా సామాజిక స్పృహ లేకపోవడమో చూపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇంటర్వ్యూకి రావడానికి సరైన సమయం 5 నుంచి 15 నిమిషాలు మాత్రమేనని, అంతకంటే ఎక్కువ కాదని ఆయన తేల్చి చెప్పారు.
ఆయన పోస్ట్ వెంటనే వైరల్ అయింది.రకరకాల కామెంట్లు వచ్చాయి.కొందరు ఆయనతో ఏకీభవించగా, చాలామంది మాత్రం ఆయన తీర్పుని తప్పుపట్టారు.“ఇది చాలా విడ్డూరంగా ఉంది.ఆ అభ్యర్థిని నా దగ్గరికి పంపించండి.నేను వెంటనే ఉద్యోగం ఇస్తాను,” అని ఒకరు కామెంట్ చేశారు.”బహుశా అతను బస్సులో వచ్చి ఉండొచ్చు.కనీసం అతను సమయానికి చేరుకోవాలని చూశాడు,” అని ఇంకొకరు అన్నారు.
రవాణా సమయం అతని చేతుల్లో లేకపోవచ్చని మరొకరు పాయింట్ అవుట్ చేశారు.మొత్తానికి, మరీ ముందుగా రావడం నిజంగా తప్పా, అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.