పంబన్ బ్రిడ్జి( Pamban Bridge ) భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి.ఇది 1914లో ప్రారంభమైన దేశపు మొట్టమొదటి సముద్రంపై నిర్మించిన రైలు వంతెనగా ప్రసిద్ధి చెందింది.
ఈ వంతెన పంబన్ ద్వీపాన్ని రామేశ్వరం( Rameswaram ) పట్టణానికి కలుపుతూ, శ్రీలంక – భారత్ మధ్యనున్న పాక్ జలసంధిపై నిర్మించబడింది.పంబన్ వంతెన దశాబ్దాలుగా భక్తులు, పర్యాటకులు, స్థానికులకు ప్రధాన ప్రయాణ మార్గంగా నిలిచి, భారత ఇంజినీరింగ్ చాతుర్యాన్ని ప్రతిబింబించింది.
అలాగే పంబన్ వంతెనకు మరొక ప్రత్యేకత ఏమిటంటే… దీని ప్రారంభోత్సవాన్ని శ్రీరాముని పుట్టినరోజైన శ్రీరామనవమి నాడు జరపడం.ఎందుకంటే, రామేశ్వరం హిందూ పురాణాల్లో ముఖ్యంగా రామాయణంలో ఓ పవిత్ర స్థలంగా గుర్తింపు పొందింది.
అందువల్ల ఇది సాంకేతికతతోపాటు సాంస్కృతిక వైభవానికి కూడా నిదర్శనంగా నిలుస్తుంది.
దేశ అభివృద్ధిలో మరో ఘనమైన ఘట్టం ప్రారంభమైంది.
తమిళనాడులోని( Tamil Nadu ) రామనాథపురం జిల్లా పరిధిలో నిర్మించిన పంబన్ కొత్త వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిను ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) ప్రారంభించారు.రూ.535 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ( RVNL ) ఈ బ్రిడ్జిని నిర్మించింది.2019 మార్చి 1న ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయగా, 2020లో నిర్మాణ పనులు మొదలయ్యాయి.4 సంవత్సరాల పాటు నిపుణుల శ్రమతో ఈ బ్రిడ్జి పూర్తి చేశారు.పాత బ్రిడ్జిని 2022 డిసెంబర్‌లో మూసివేయడంతో, రామేశ్వరం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు కొత్త బ్రిడ్జి ప్రారంభంతో వారి ప్రయాణం మరింత వేగవంతం, సురక్షితంగా మారనుంది.పాత వంతెనపై 30 నిమిషాల ప్రయాణం పడితే, కొత్త వంతెనపై కేవలం 5 నిమిషాల్లో రైలు పరుగెత్తుతుంది.
ఈ వంతెనలో ప్రత్యేకంగా రూపొందించిన వర్టికల్ లిఫ్ట్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.దీని పొడవు 72.5 మీటర్లు కాగా, బరువు 660 టన్నులుగా ఉంది.ఓడలు క్రాస్ అయ్యే సమయంలో బ్రిడ్జిని పైకి లేపే ఈ టెక్నాలజీ పూర్తిగా రిమోట్ కంట్రోల్ ఆధారంగా పనిచేస్తుంది.
దీనిలో 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం.మిగతా బరువును కౌంటర్ వెయిట్లు సమతుల్యం చేస్తాయి.ఇక ఈ బ్రిడ్జిలో ఉన్న 99 దిమ్మెలు ఒక్కోటి 18.3 మీటర్ల పొడవుతో ఉండగా, వాటికన్నా మూడుచోట్ల గుండ్రటి పిల్లర్స్ నిర్మించారు.సముద్ర మట్టానికి 25-35 మీటర్ల లోతులో పునాదులు వేశారు.తుప్పు నివారణ కోసం మూడు పొరల సిల్వర్ పెయింట్ వేయడం జరిగింది.ఇది వంతెనకు 58 సంవత్సరాల వరకు రక్షణ కలిగిస్తుంది.మరమ్మతులతో వందేళ్ల వరకూ నిలబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా, గాలుల వేగం 58 కి.మీ.కు పైగా అయితే స్కాడా సెన్సర్లు ఆటోమేటిక్‌గా ట్రాఫిక్‌ను ఆపేస్తాయి.వంతెనపై గదుల్లో స్పెయిన్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించిన భారీ మోటార్లు, చక్రాలు అమర్చారు.
అలాగే, భారత టెక్నాలజీతో ఇతర నిర్మాణ భాగాలు తయారు చేశారు.పాత బ్రిడ్జి భారతదేశానికి గర్వకారణంగా నిలిచినట్లే, ఈ కొత్త వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి కూడా దేశ సాంకేతిక సామర్థ్యాన్ని, అభివృద్ధిని తెలియజేస్తుంది.
రామేశ్వరం నుంచి తాంబరానికి త్వరలోనే ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది.అదే సమయంలో ప్రధాని మోదీ రూ.8,300 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్ని పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.అనంతరం రామేశ్వరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
మొత్తానికి పంబన్ బ్రిడ్జి ఒక చారిత్రక వంతెనగా మాత్రమే కాదు.ఒక ఆధునిక సాంకేతిక వైభవంగా దేశ ప్రగతికి దారితీసే మార్గంగా నిలుస్తోంది.
ఇది తరం తరాలకు స్పూర్తిగా నిలిచి, భారతదేశం సాంకేతికంగా ఎంత ముందుకెళ్లిందో చూపించే ప్రతీకగా నిలవనుంది.