తెలంగాణలో చికెన్ ప్రియులు, కోళ్ల పెంపకందారులు, చికెన్ వ్యాపారులకు ప్రభుత్వం షాకింగ్ వార్నింగ్ జారీ చేసింది.బర్డ్ ప్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో ఈ వైరస్ కారణంగా భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి.దీంతో ఈ వైరస్ తెలంగాణకు వ్యాపించే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణ పశుసంవర్ధక, మత్స్యశాఖ విభాగం తెలిపిన వివరాల ప్రకారం, బర్డ్ ప్లూ వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచించిన చర్యలను అమలు చేస్తున్నామని పేర్కొంది.కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కోళ్ల ఫారాల్లో అనుమానస్పద మరణాలు సంభవిస్తే వెంటనే సంబంధిత వెటర్నరీ దవాఖానకు సమాచారం అందించాలని సూచించారు.

వెటర్నరీ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు పూర్తిగా సహకరించాలని, అవసరమైన సమాచారం అందించాలని కలెక్టర్లు కోళ్ల ఫారాల యాజమానులకు సూచించారు.బర్డ్ ప్లూ వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు కోళ్లు, గుడ్లు, కోళ్ల దానా దిగుమతులను నిషేధించారు.వైరస్ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతుల ద్వారా వ్యాపించే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.

బర్డ్ ప్లూ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో నిలవలేకపోతుందని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తింటే ప్రమాదం ఉండదని తెలిపారు.అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోళ్ల ఫారాల యాజమానులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది.కోళ్లు లేదా ఇతర జంతువుల్లో అనుమానాస్పద మరణాలు కనిపిస్తే వెంటనే జిల్లా అధికారులకు సమాచారం అందించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులు హెచ్చరించారు.
సరైన చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు.ఇలాంటి విపత్తులను నివారించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, కోళ్ల ఫారాల యాజమానులు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.







