నల్లగొండ జిల్లా: నల్లగొండ-హాలియా జాతీయ రహదారిపై చింతగూడెం స్టేజీ నుంచి యాచారం గ్రామం వరకు గల ఆర్ అండ్ బీ రహదారి అత్యంత అధ్వానంగా తయారైందని ఈ ప్రాంత ప్రజలు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా రోడ్డు నిర్మాణం చేపట్టి కంకర పోసి వదిలేశారని,పనులు ఇంకా పూర్తి కాలేదని వాపోతున్నారు.
సుమారు 10 గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై రాకపోకలకు సాగిస్తూ దుమ్ము ధూళితో నిత్యం ఇబ్బంది పడుతున్నారని,ప్రతిరోజు సంబంధిత గ్రామాల నుండి ప్రజలు హాలియా, నల్గొండకు ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తుందని అంటున్నారు.రహదారిపై కంకర కుప్పలతో అసంపూర్తి పనులతో వాహనదారులు ప్రమాద బారిన పడుతున్నట్లు, వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
ఈ కంకరపై పశువులు నడుచుకుంటూ వెళ్లడంతో కాళ్లకు గుచ్చుకొని గాయాల బారిన పడుతున్నాయని,భారీ వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాటి నుంచి వచ్చే దుమ్ము తట్టుకోలేకపోతున్నామని చెబుతున్నారు.అధికంగా రైతులు ప్రయాణం సాగించే ఈ రహదారి విషయంలో ఇప్పటికైనా అధికారులు,ప్రజాప్రతినిధులు చొరవ చూపి పనులు పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.