రాజన్న సిరిసిల్ల జిల్లా : సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీ క్రిస్టియానా జడ్ చోంగ్తూ ఆదేశించారు.రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, వాటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల వ్యాప్తి పై అడిగి తెలుసుకున్నారు.
ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? నియంత్రణకు ఏమి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు తెలుసుకున్నారు.అన్ని పట్టణాలు, గ్రామాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.
వ్యాధులు, పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పై అందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ఇక్కడ డీఎంహెచ్ఓ వసంతరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ రాజగోపాల్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.