భారత్‌కు చెందిన సత్నామ్ సింగ్ అనే ఓ కార్మికుడు ఇటలీలో అత్యంత దయనీయ స్ధితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.దీంతో ఇటలీ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి బాధితుడికి వైద్య సహాయం అందించకుండా రోడ్డుపై పడేసిన వ్యవసాయ కంపెనీ యజమానిని ఇటలీ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు.అయితే సత్నామ్ సింగ్ మరణం తర్వాత ఇటలీలోని గ్యాంగ్ మాస్టరింగ్‌పై సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆధునిక బానిసత్వంగా పరిగణించే ఈ విధానం దక్షిణ ఇటలీలో విస్తృతంగా వ్యాపించింది.ఈ నేపథ్యంలో ఇటలీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
దీనిలో భాగంగా శనివారం నార్త్ వెరోనా ప్రావిన్స్( Italys Verona province )లో 33 మంది భారతీయ కార్మికులను.దుర్భర బానిసత్వ పరిస్ధితుల నుంచి విముక్తి చేశారు.
అలాగే ఈ దాడుల్లో దాదాపు 5,45,300 డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.సత్నామ్ సింగ్( Satnam Singh ) తరహాలోనే పలువురు గ్యాంగ్ మాస్టర్లు సీజనల్ వర్క్ పర్మిట్‌పై కొందరు భారతీయులను ఇటలీకి తీసుకొచ్చినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఒక్కొక్కరికి 17 వేల యూరోలు చెల్లించి మంచి భవిష్యత్తును అందిస్తామని మాయమాటలు చెప్పినట్లుగా తెలుస్తోంది.అలా ఇటలీలో అడుగుపెట్టిన వారిని వ్యవసాయ క్షేత్రాల్లో పనిలో పెట్టారు.
రోజుకు 10-12 గంటల పాటు కష్టపడినా వారికి కేవలం 4 యూరోలు మాత్రమే చెల్లించేవారు.

శాశ్వత వర్క్ పర్మిట్( Permanent work permit ) కోసం అదనంగా 13,000 యూరోలు చెల్లించాలంటే ఉచితంగా పనిచేయాలని గ్యాంగ్ మాస్టర్లు కార్మికులకు చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు.నిజానికి ఇది వారికి ఎప్పటికీ ఇవ్వబడదని తెలిపారు.గ్యాంగ్ మాస్టర్లపై బానిసత్వం, శ్రమ దోపిడీకి సంబంధించిన నేరాలకు పాల్పడినట్లుగా అభియోగాలు నమోదుచేశారు.
బాధితులకు రక్షణ, ఉపాధి అవకాశాలు, చట్టపరమైన నివాస పత్రాలు అందిస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇతర ఐరోపా దేశాల మాదిరిగానే, ఇటలీలో పెరుగుతున్న కార్మికుల కొరత తరచుగా ఇమ్మిగ్రేషన్ ద్వారా భర్తీ చేయబడుతుంది.ముఖ్యంగా తక్కువ వేతనాలు చెల్లించే ఉద్యోగాలలో మైగ్రెంట్ వర్క్ వీసా వ్యవస్ధను వినియోగిస్తున్నారు.నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఇస్టాట్ 2021 గణాంకాల ప్రకారం.
దాదాపు 11 శాతం ఇటాలియన్ కార్మికులు చట్టవిరుద్ధంగా ఉపాధి పొందారు.వ్యవసాయంలో వీరి సంఖ్య 23 శాతం పైగా ఉందని అంచనా.