నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలంలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతుంది.గ్రామాల్లో ప్రజల వద్ద నుండి కొందరు తక్కువ రేటుకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి అధిక రేటుకు అమ్ముకుంటూ అక్రమ వ్యాపారం యథేచ్చగా కొనసాగిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా ఈ రేషన్ మాఫియా అడ్డూ అదుపూ లేకుండా నడుస్తోంది.నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.1కే అందిస్తున్న బియ్యం తినడానికి అనుకూలంగా లేకపోవడంతో నెలనెలా వాటిని తెచ్చుకుంటున్న పేదలు ఇంట్లో నిల్వ చేసుకోని కేజీ రూ.10 నుండి రూ.15 వరకు అమ్ముకోవాల్సి వస్తుంది.దీనిని ఆసరా చేసుకున్న అక్రమ వ్యాపారులు ప్రజల నుండే కాకుండా నేరుగా రేషన్ డీలర్ల వద్ద నుండి నేరుగా బియ్యం దందాను కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొందరు రేషన్ డీలర్లు కూడా ప్రజలు తీసుకుపోయి అమ్ముకుంటే ఆ డబ్బులు ఏవో మేమే ఇస్తామని బియ్యం ఉంచుకొని డబ్బులు ఇస్తున్న సందర్భాలు లేకపోలేదు.ఇంత జరుగుతున్నా సంబధిత అధికారులకు తెలియదా అంటే అందరికీ తెలిసే ఈ అక్రమ దందా సాగుతుందని అందరికీ తెలుసు కానీ,వారికి అందే మామూళ్లు వారికి అందడంతో ఎవరూ ఏమీ తెలియనట్లు ఉంటారనే ఆరోపణలు వస్తున్నాయి.
అసలు ప్రభుత్వం ఇచ్చే బియ్యం తినడానికి అనుకూలంగా ఉంటే కూటికి లేని నిరుపేదలు కూడా ఎందుకు బియ్యం అమ్ముకుంటారు?అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.మనిషి అనేవాడు తినలేని బియ్యం ఇచ్చి అక్రమార్కులకు ప్రభుత్వాలే అవకాశం ఇచ్చినట్లుగా ఉందని, ప్రజలు తినే బియ్యం సరఫరా చేస్తే తప్ప ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోలేరని పలువురు అభిప్రాయపడుతున్నారు.