రైతులకు వ్యవసాయ భూమి తక్కువగా ఉంటే, తక్కువ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందాలంటే కూరగాయల సాగు తోనే సాధ్యం.కూరగాయల సాగు విధానాలపై అవగాహన ఉంటే వ్యాపారులు, ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదించవచ్చు.
అయితే కూరగాయలలో తక్కువ సమయంలో చేతికి వచ్చే పంట బీర( Ridge gourd ).ఈ బీర కూరగాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.వేసవికాలంలో బీర సాగు చేస్తే, కొన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.అప్పుడే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు.బీరకాయను పందిరి విధానంలో సాగు చేస్తే చీడపీడల, తెగుళ్ల బెడద చాలా తక్కువ.ఒకవేళ చీడపీడలు లేదా తెగుళ్లు ఆశిస్తే తొలి దశలోనే అరికట్టి పంటను సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.

బీర సాగుకు ఆమ్లా, క్షార గుణాలు ఉండే నేలలు తప్ప అన్ని రకాల నేలలు సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.నీరు నిల్వ ఉండకుండా మురుగు నీరు బయటికి పోయే విధంగా పొలాన్ని తయారు చేసుకోవాలి.ఒక ఎకరం పొలానికి 8 టన్నుల పశువుల ఎరువు, 35 కిలోల భాస్వరం( Phosphorus ), 15 కిలోల పోటాష్ ఎరువులు వేసుకోవాలి.ఒక కిలో విత్తనాలకు ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఆ తర్వాత 100 గ్రాముల విత్తనాలకు రెండు గ్రాముల ట్రైకోడెర్మావిరిడితో( Trichodermaviridae ) శుద్ధి చేయాలి.వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది.
పూత, పిందే తగ్గి దిగుబడి కూడా తక్కువగానే ఉంటుంది.కాబట్టి మొక్కలను తక్కువ దూరంలో నాటుకొని, మొక్కల సాంద్రత పెంచాలి.
దీంతో మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది.

బీర విత్తనాలు నాటే ముందే పొలానికి ఒక నీటి తడి పెట్టాలి.విత్తిన నాలుగు రోజుల తర్వాత మరొకసారి నీటి తడి అందించాలి.ఇక గింజలు మొలకెత్తే వరకు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి.
మొక్క పాదుచుట్టూ మూడు నుండి ఐదు సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు అందించాలి.ఇక బీర పంట 60 నుండి 90 రోజుల వ్యవధిలో కోతకు వస్తుంది.
ఇక పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ, ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే తొలి దశలోనే అరికట్టాలి.కాయలు ముదరకుండా లేతగా ఉన్నప్పుడు కోస్తే మంచి గిట్టుబాటు ధర పొందవచ్చు.