ఖమ్మం నగరంలో ప్రతి డివిజన్‌లో సి.సి.డ్రైయిన్లను నిర్మించి మురుగు నీటి సమస్యను పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.బుధవారం నగరంలోని 10వ డివిజన్ ఇందిరా నగర్ పర్ణశాల వద్ద రూ.90 లక్షలతో 2.8 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సిసి డ్రెయిన్ల నిర్మాణ పనులకు నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో అన్ని డివిజన్లలో సువిశాలమైన వి.డి.ఎఫ్.సి.సి రోడ్లు, డ్రైన్లు, జంక్షన్లు, పార్కులు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి నగరాన్ని సుందర నగరంగా అభివృద్ధి పర్చడం జరిగిందన్నారు.
ప్రజలు తమ ఆవాసాలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని నగరపాలక సిబ్బందికి సహకరించాలని, వచ్చే వర్షాకాల సీజన్‌లో నీటి నిల్వల వల్ల దోమల వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు పాటించాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, మున్సిపల్ ఇ.ఇ.కృష్ణలాల్, కార్పోరేటర్ మాధురి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.







