రాబోయే ఎన్నికల్లో వైసీపీ ని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు, ఆ పార్టీకి తిరుగులేకుండా చేసేందుకు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ చాలా కసరత్తే చేస్తున్నారు.ఇప్పటికే నియోజకవర్గాల వారిగా సర్వేలు నిర్వహించారు.
ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారు , పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యే ల కు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదే లేదు అని తేల్చి చెప్పేశారు.రాబోయే ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే జగన్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడడం లేదు.
అలాగే కొన్ని కొన్ని కీలక నియోజకవర్గల్లో ముందుగానే అభ్యర్థులను జగన్ ఫిక్స్ చేస్తున్నారు.ముఖ్యంగా తన సొంత జిల్లా కడపలో పట్టు చేజారిపోకుండా చూసుకుంటున్నారు.
జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో పాటు, ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కంచు కోటలుగా మార్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
అయితే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, అక్కడ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి ఆ లోటు తీర్చుకోవాలని చూస్తున్నారు.
ఇప్పటికే పులివెందుల నుంచి జగన్, కమలాపురం నుంచి జగన్ మేనమామ రవీందర్ నాథ్ రెడ్డి , ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు.మిగిలిన నియోజకవర్గాల్లోనూ తిరుగులేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.కడప స్టీల్ ప్లాంట్ ను ఈ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేస్తూ ఉండడం తో ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా జగన్ తీసుకుంటున్నారు.
గతంలో ఇక్కడి నుంచి వైఎస్ కుటుంబం మద్దతిచ్చిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు.నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దేవగుడి, రామ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య విభేదాలు పెరిగాయి.అయినా 2019లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ రెడ్డి గెలిచారు.అయినా ఇక్కడ వైసిపికి పూర్తిస్థాయిలో పట్టు దొరకడం లేదు.రాబోయే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.వైసీపీలో ఉన్న రామసుబ్బారెడ్డి నుంచి నియోజకవర్గ విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండడంతో , ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న సుధీర్ రెడ్డి పైన వ్యతిరేకత పెరుగుతుండడంతో, ఆయన స్థానంలో జగన్ భార్య వైఎస్ భారతిని ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారట.ఇక్కడ భారతిని రంగంలోకి దంచడం ద్వారా, కడప స్టీల్ ప్లాంట్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు, రాబోయే ఎన్నికల ఫలితాలు తర్వాత కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఆ పార్టీతో వైరం ఏర్పడినా తన కేసుల్లో సిబిఐ, ఈడి వంటి సంస్థలు రంగంలోకి దిగి తనను ఇబ్బంది పెట్టినా సీఎం సీట్లో భారతిని కూర్చోబెట్టవచ్చు అనే ముందు చూపుతో జగన్ భారతిని పోటీకి దించే ఆలోచనలో ఉన్నారట.