వైసిపికి, జగన్ కుటుంబానికి వీర విధేయుడుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం తిరుగుబావుటా ఎగుర వేశారు.తనకు సరైన ప్రాధాన్యం పార్టీ లో ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తూ.
తాను వైసీపీలో ఒక ఇమాడలేను అని, రాబోయే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తాను అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.ఇక ఈ వ్యవహారం వైసిపి లో పెద్ద దుమారమే రేపింది.
శ్రీధర్ రెడ్డి వ్యవహారానికంటే ముందుగా వైసిపి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇదేవిధంగా వ్యాఖ్యానించి వైసిపి అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు.అయితే శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను టిడిపి నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించుకోవడంపై నెల్లూరు టిడిపిలో కలకలం రేగింది .

పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా… చంద్రబాబు ఏ ప్రకటన చేయకముందే శ్రీధర్ రెడ్డి తనకు తాను టిక్కెట్ ఎలా ప్రకటించుకుంటారని, అసలు ముందుగా ఆయన టిడిపిలో చేరకుండా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏమిటని నెల్లూరు టిడిపి నాయకులు అంతా అసంతృప్తిని వ్యక్తం చేశారు.అంతేకాదు శ్రీధర్ రెడ్డి కారణంగా తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, జైలు జీవితం గడిపాము అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను పార్టీలోకి తీసుకోవద్దు అంటూ నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు అధిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.అంతేకాకుండా శ్రీధర్ రెడ్డి రాకను టిడిపి సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ కీలక నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ని పోటీగా భావిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలిస్తే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకుంటున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రివర్గ విస్తరణలో తనకు పోటీ అవుతారని భావిస్తున్నారట.

ఇప్పటికే శ్రీధర్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న టిడిపి కీలక నేతలంతా ఆయనకు వ్యతిరేకంగా నివేదికను తయారుచేసి చంద్రబాబుకు పంపించినట్లు తెలుస్తోంది.శ్రీదర్ రెడ్డి టిడిపి లో చేరకముందే ఇన్ని వ్యవహారాలు చోటుచేసుకుంటున్నా.టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం శ్రీధర్ రెడ్డి విషయంలో సైలెంట్ గానే ఉన్నారు .ఆయనను పార్టీలో చేర్చుకుంటామని కానీ, చేర్చుకోము అని కానీ ఎటువంటి ప్రకటనలు, సంకేతాలు ఇవ్వడం లేదట.అసలు చంద్రబాబు అనుమతితోనే శ్రీధర్ రెడ్డి సొంతంగా టికెట్ ను ప్రకటించుకున్నారా అనే అనుమానాలు టిడిపి నేతలు కలుగుతున్నాయి.
ఎన్నికలకు ముందు ఆయనను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అనే విషయం పైన నెల్లూరు తెలుగు తమ్ముళ్లు ఆరా తీస్తున్నారట.శ్రీధర్ రెడ్డి అనుచరులు మాత్రం చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
త్వరగా శ్రీధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లేందుకు, ప్రచారం నిర్వహించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయాల్లో ఉన్నారట.







