తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారం తెరపైకి వచ్చి వివాదం అవుతూ ఉంటుంది.ముఖ్యంగా ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలు ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేస్తున్నాయి.
ఈ విషయం 2014 నుంచి అందరికీ అర్థమైంది.ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం పెద్దలు చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.
కొద్దిరోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ లో జంబో కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో సీనియర్ నాయకుల కంటే రేవంత్ రెడ్డి వర్గానికి ఎక్కువగా పదవులు కేటాయించడంపై ఇప్పుడు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
స్వయంగా పార్టీ అధిష్టానం పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ముందు మాట్లాడడం సంచలనంగా మారుతుంది.తెలంగాణ కాంగ్రెస్ కు 84 మంది జనరల్ సెక్రటరీలను నియమించడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని, అలకలు తగ్గుతాయని, తమకు పదవి దక్కలేదనే అసంతృప్తి ఉండదని కాంగ్రెస్ అధిష్టానం భావించగా , ఇప్పుడు ఆ జనరల్ సెక్రటరీ నియామకాలపైనే సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ దీనిపై స్పందించారు.” ఒకప్పుడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంటే ఓ 15 మంది మాత్రమే ఉండేవారు.వారు కూడా సూపర్ సీనియర్లే అయి ఉండేవారు.కానీ ఇప్పుడు ఆరు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి కూడా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని కట్టబెట్టేస్తున్నారు.10 ,15 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో నమ్మకంగా ఉంటున్న వారికి పార్టీ అధిష్టానం మొండి చేయి చూపిస్తోంది.ఇదెక్కడి లెక్క ? దీన్ని ఎలా తీసుకోవాలి ? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఇక సీఎల్పీ నేత బట్టి విక్రమార్క దీనిపై స్పందించారు.” కాంగ్రెస్ లో కేవలం ఇదొక్కటే సమస్య కాదు.ఇంకా చాలా సమస్యలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పిఎసి లో చోటు దక్కలేదని కొందరు, కొత్తవారిని సీనియర్లను ఒకే విధంగా ట్రీట్ చేశారని ఇంకొందరు, ఇలా రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి.

ఒకప్పట్లో పీసీసీ, సీఎల్పీ పదవులు జోడెద్దుల సమాన హోదా కలిగి ఉండేవి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పార్టీ తయారైంది ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్య ఐక్యతను పూర్తిగా దెబ్బతీసేలా ఉంది ” అని భట్టి వ్యాఖ్యానించారు.జనరల్ సెక్రటరీల నియామకం పార్టీలో ఒక సమగ్రమైన పరిశీలన లేదు.సామాజిక న్యాయం కూడా పాటించలేదు.అందరి అభిప్రాయాలు తీసుకోకుండా ఇష్టానుసారంగా నిర్ణయాన్ని తీసుకున్నారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ విధంగా సీనియర్ నేతలంతా ప్రస్తుత కమిటీ నియామకంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.







