లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.తద్వారా ఈ పదవిని అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు.
దేశాన్ని గాడిలో పెట్టేందుకు రిషి సునాక్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిపై విమర్శలు వస్తున్నప్పటికీ , ఆయన ముందుకే సాగుతున్నారు.
ఇకపోతే.రిషి సునాక్ ప్రధాని కాకముందు నుంచే ఆయన కుటుంబానికి బ్రిటన్‌లో పాపులారిటీ వుంది.
రిషి భార్య బ్రిటన్‌లోని సంపన్నుల్లో ఒకరు కాగా.ఆయన కుమార్తెలు కృష్ణ సునాక్, అనౌష్క సునాక్‌లకు కూడా స్టార్ కిడ్స్‌గా అక్కడ పేరుంది.
ఈ నేపథ్యంలో రిషి సునాక్ కుమార్తె అనౌష్క శుక్రవారం పలువురు చిన్నారులతో కలిసి భారతీయ సంప్రదాయ నృత్యమైన కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది.‘‘రాంగ్ – ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022’’లో భాగంగా ఆమె ఈ ప్రదర్శన ఇచ్చింది.
ఈ డ్యాన్స్ ఫెస్టివల్‌లో 4 నుంచి 85 ఏళ్ల వయసు గల వందమంది కళాకారులు, సంగీతకారులు పాల్గొన్నారు.వారందరి ముందు ఎలాంటి బిడియం లేకుండా 9 ఏళ్ల అనౌష్క ప్రదర్శన ఇచ్చి ఔరా అనిపించుకుంది.
ఈ కార్యక్రమానికి రిషి సునాక్ సతీమణి అక్షత, ఆయన తల్లిదండ్రులు హాజరయ్యారు.

మరోవైపు.రిషి భార్య అక్షతా మూర్తి అరుదైన ఘనత సాధించారు.ఆసియన్ రిచ్ లిస్ట్ 2022లో తొలిసారిగా చోటు దక్కించుకున్నారు.ఈ జాబితాలో యూకేలో స్థిరపడ్డ హిందూజా బ్రదర్స్ అగ్రస్థానంలో నిలిచారు.30.5 బిలియన్ పౌండ్ల సంపదతో వీరు వరుసగా ఎనిమిదోసారి నెంబర్‌వన్ ప్లేస్‌లో నిలిచారు.గతేడాదితో పోలిస్తే హిందూజా బ్రదర్స్ ఆస్తులు 3 బిలియన్ పౌండ్లు పెరగడం విశేషం.790 మిలియన్ పౌండ్ల సంపదతో అక్షతా మూర్తి ఈ జాబితాలో 17వ స్థానాన్ని సంపాదించారు.ఈ జాబితాలో భారత సంతతికి చెందిన లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య, నిర్మలా సేథియా, ప్రకాశ్ లోహియాలు కూడా చోటు దక్కించుకున్నారు.







