వాటర్ బాటిల్ అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది బిస్లేరీ.అంతలా కొన్నేళ్లుగా అందరికీ బిస్లేరీ వాటర్ బాటిళ్లు అలవాటు అయ్యాయి.
ఈ తరుణంలో బిస్లేరీ కంపెనీని సదరు సంస్థ యాజమాన్యం విక్రయించేందుకు ముందుకు వచ్చింది.దీంతో ఆ సంస్థను దక్కించుకునేందుకు టాటా సంస్థ పావులు కదుపుతోంది.
ఇంతకు ముందే బిస్లేరీ కంపెనీ తమకున్న శీతల పానీయాల బ్రాండ్లు థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కాను 1993లో పానీయాల దిగ్గజం కోకాకోలాకు విక్రయించింది.ఇది జరిగిన దాదాపు 30 ఏళ్ల తర్వాత బిస్లేరీ కంపెనీని కూడా ఆ కంపెనీ అమ్మేస్తోంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బిస్లెరీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ భారతదేశపు అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీని టాటా గ్రూప్ యొక్క FMCG ఆర్మ్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL)కి 6,000 నుండి 7,000 కోట్ల రూపాయలకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ విషయాన్ని బిస్లేరీ కంపెనీ సంస్థ ఛైర్మన్ 82 ఏళ్ల రమేష్ చౌహాన్ వెల్లడించారు.చౌహాన్ ఇటీవలి కాలంలో ఆరోగ్యం బాగా లేక ఇబ్బంది పడుతున్నారు.బిస్లరీని నడిపించడానికి తనకు వారసుడు లేడని చెప్పారు.కుమార్తె జయంతికి వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదని వెల్లడించారు.బిస్లరీని విక్రయించడం అనేది ఇప్పటికీ బాధాకరమైన నిర్ణయమే అయినప్పటికీ టాటా గ్రూప్ దీనిని మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు.
విలువలు మరియు సమగ్రతతో కూడిన టాటా సంస్కృతిని తాను ఇష్టపడుతున్నానని, ఇతర ఆసక్తిగల కొనుగోలుదారులు చూపిన దూకుడును పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.రెండేళ్లుగా టాటా గ్రూప్‌తో చర్చలు జరుగుతున్నాయని, కొన్ని నెలల క్రితం టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మరియు టాటా కన్స్యూమర్ సీఈఓ సునీల్ డిసౌజాతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.