ఏపీ అధికార పార్టీగా వైసిపి ఉండగా, ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉంది .అయితే ఈ రెండు పార్టీలతో పోల్చితే జనసేన బలం చాలా తక్కువ.2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని ఆ పార్టీ దక్కించుకుంది.ఇక పూర్తిగా పార్టీ ప్రభావం ఏమీ ఉండదని , 2024 ఎన్నికల్లో ప్రధాన పోటీ అంతా వైసీపీ టిడిపి మధ్య ఉంటుందని అంత అంచనా వేశారు.
అయితే ఊహించని విధంగా జనసేన ఏపీలో బలం పెంచుకుంటోంది.రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలోనూ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ, సొంతంగా బలపడే విషయం పైన దృష్టి పెట్టింది.
దీంతో జనసేన ప్రభావం ఏపీలో బాగా పెరిగింది.టిడిపి వైసిపిలలో ఇమడలేని నాయకులంతా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా జనసేన ను చూస్తూ 2024 ఎన్నికలకు ముందు పార్టీలో చేరే విధంగా మంతనాలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసే ఆలోచనలో పవన్ ఉన్నా… బలమైన సీట్లలోనే పోటీ చేస్తే ఫలితం అనుకూలంగా ఉంటుందని, కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవ్వవచ్చనే లెక్కల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు.జనసేన , టీడీపీ లు ఏపీలో పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం చాలా కాలం నుంచి ఉన్నా… పవన్ టిడిపి తో పొత్తు ప్రసక్తే లేదు అంటూ తేల్చేశారు.
దీంతో బీజేపీ , జనసేన మాత్రమే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయనే విషయం క్లారిటీ వచ్చింది.అయితే జనసేన సొంతంగా బలం పెంచుకుంటూ తమకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వెళ్లడం టిడిపికి ఆందోళన కలిగిస్తుంది.

జనసేన ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్నా… ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు అంత కలిస్తే ఓటింగ్ శాతం ఎక్కువగానే ఉంటుంది.టిడిపి జనసేన పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు జనసేనకు కేటాయించినా… మిగతా స్థానాల్లో జనసేన ఓట్లు టిడిపికి కలిసి వస్తాయని అంచనా వేస్తూ ఉంది.అయితే జనసేన సొంతంగా బలం పెంచుకోవడంతో 2024 ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా … జనసేన ఎక్కువ సీట్లు కోరుతుందని, అలా ఇవ్వని పక్షంలో ఒంటరిగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతుందని అదే జరిగితే తాము మళ్లీ ఓటమి చవిచూడాల్సి వస్తుందనే టెన్షన్ తెలుగుదేశం పార్టీలో నెలకొంది.

ఇక ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలతో టిడిపి బలం పెంచుకోకపోగా, బలహీనమవుతుండడం , చాలా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను నడిపించేందుకు ఎవరు ముందుకు రాకపోవడం వంటివన్నీ టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి.అలాగే స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ, వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా, జనాలు పెద్దగా పట్టించుకోకపోవడం, చంద్రబాబు ప్రసంగాలు రొటీన్ గా మారడం, టిడిపి అనుకూలం మీడియా అదే పనిగా వైసీపీ పై విమర్శలు చేస్తూ వస్తున్నా, అవి టీడీపీకి కలిసి రాకపోగా, అవన్నీ చంద్రబాబు కనుసనల్లో పనిచేసే సంస్థలు గానే జనాలు ముద్ర పడిపోవడం ఇవన్నీ టిడిపికి ఇబ్బందికరంగా మారాయి.ఇప్పుడు వైసీపీకి పోటీగా జనసేన మారుతూ ఉండడం టిడిపికి ఆందోళన కలిగిస్తోంది.







