నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పదవీ విరమణ తర్వాతి జీవితం కోసం కోసం డబ్బులు జమ చేస్తున్నారా… అయితే మీకు అలర్ట్.ఎన్పీఎస్ పేమెంట్ ప్రాసెస్‌లో తాజాగా కొన్ని మార్పులు వచ్చాయి.టైర్-2 అకౌంట్స్‌కు క్రెడిట్ కార్డ్స్ ద్వారా డబ్బులు జమ చేయడానికి ఇకపై వీలు లేదని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ స్పష్టం చేసింది.దీనివల్ల ఇకపై టైర్-2 అకౌంట్స్‌లో చందాదారులు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కాంట్రిబ్యూషన్లు చేయలేరు.
ఆగస్టు 3న ఒక అధికారిక నోటిఫికేషన్లో పెన్షన్ అథారిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.ఈ మార్పు తర్వాత కూడా NPS టైర్-1 అకౌంట్స్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే కాంట్రిబ్యూషన్ల విషయంలో ఎలాంటి చేంజ్ రాలేదు.“నేషనల్ పెన్షన్ సిస్టమ్ టైర్-II అకౌంట్స్‌లో క్రెడిట్ కార్డ్‌ను పేమెంట్ మోడ్‌గా ఉపయోగించడం కుదరదు.ఎందుకంటే సబ్స్క్రిప్షన్స్/కాంట్రిబ్యూషన్స్‌ను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే వెసులుబాటు నిలిపివేయాలని అథారిటీ నిర్ణయించింది.” అని అథారిటీ సంస్థ ఒక నోటిఫికేషన్లో తెలిపింది.
చందాదారుల ప్రయోజనాలను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది.సాధారణంగా క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా డబ్బులు జమ చేసే NPS అకౌంటు హోల్డర్లు 0.60 శాతం పేమెంట్ గేట్‌వే ఛార్జీని పే చేయాల్సి ఉంటుంది.ఇక జీఎస్టీ భారం ఉండనే ఉంది.దీనివల్ల ఆ ఖాతాదారులకు నష్టం వాటిల్లుతోంది అందుకే వారికి ఈ నష్టాలు జరగకుండా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.