ఏపీ సీఎం జగన్ భకేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా రాజకీయాలు నడుపుతున్నారు.కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో జగన్కు తెలుసు.
అందుకే ఆయనకు ఎంపీల బలం ఉన్నా ప్రత్యేకహోదా, పోలవరం నిధులు సహా పలు అంశాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు.అయితే తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరికించినట్లు కనిపిస్తోంది.
గోదావరి జిల్లాల్లో ఇటీవల పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన పోలవరం ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడుతూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని జగన్ ఆరోపించారు.
కేంద్రం డబ్బులు ఇస్తేనే తాము సహాయం చేయగలమని వివరించారు.రూ.కోటి.రూ.2కోట్లు అయితే తానే భరించేవాడినని.కానీ రూ.20వేల కోట్లు కావాలని జగన్ వెల్లడించారు.అందుకే ప్రతీసారి కేంద్రాన్ని ఇదే విషయం అడుగుతున్నానని జగన్ చెప్పారు.
కేంద్రం నిధులు ఇస్తేనే పోలవరం ముంపు ప్రాంతాల్లోని వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయగలమని సీఎం జగన్ కుండబద్దలు కొట్టారు.వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు.
స్వయంగా ప్రధాని మోడీని కలిసి సమస్యలు వివరిస్తానని ప్రకటించారు.వరద బాధితులు తమను తిట్టుకుంటున్నారని కూడా ప్రధానికి వివరిస్తానన్నారు.
పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుతామని సెప్టెంబర్ నాటికి పరిహారం పునరావాసం కల్పిస్తామని జగన్ హామీ పడ్డారు.
అయితే కేవలం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మాత్రమే కేంద్ర ప్రభుత్వానిది అని.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాష్ట్రాలే భరించాలని గతంలో 14వ ఆర్ధిక సంఘం తేల్చి చెప్పిందని పలువురు నిపుణులు గుర్తుచేస్తున్నారు.అయినా జగన్ ఇప్పుడు కేంద్రంపై ఆరోపణలు చేయడం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే అని స్పష్టం చేశారు.
ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.చూస్తుంటే సోము వీర్రాజుకు బాగానే పని పడినట్లు అర్ధమవుతోంది.జగన్ కేంద్రం వైపు వేలు చూపించి మాట్లాడటంపై సోము ఎలా స్పందిస్తారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.