2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ దారుణంగా నష్టపోయింది.2014లో 102 మంది ఎమ్మెల్యేలను గెలిచిన పార్టీ 2019లో 23 స్థానాలకే పరిమితమైంది.దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు దృఢనిశ్చయంతో పనిచేస్తున్నారు.వయసును లెక్కచేయకుండా యువనేత మాదిరిగా పర్యటనలు చేస్తున్నారు.గతంలో ఎక్కడ తప్పులు చేయడం వల్ల తాము ఓటమి పాలయ్యాం.ఆ తప్పులను సరిదిద్దుకోవడం ఎలా.వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలేంటి ఇలా అనేక అంశాలపై చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా టీడీపీ కంచుకోటలు, పార్టీకి గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాలలో గత ఎన్నికల్లో ఓటమి పాలవడంపై టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోవడం ప్రారంభించింది.
దీంతో పలు నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఆముదాలవలస.విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట, విశాఖపట్నం జిల్లాలో మాడుగుల, నర్సీపట్నం.తూర్పుగోదావరిలోని తుని, ప్రత్తిపాడు.
పశ్చిమ గోదావరిలోని కొవ్వూరు, తణుకు, దెందులూరు, ఏలూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో చంద్రబాబు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
అటు కృష్ణా జిల్లాలోని నందిగామ, మైలవరం, విజయవాడ సెంట్రల్.
గుంటూరు జిల్లాలోని పొన్నూరు, వేమూరు, చిలకలూరిపేట, వినుకొండ.కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు.
అనంతపురంలోని రాప్తాడు, పెనుకొండ, కల్యాణదుర్గం, తాడిపత్రి వంటి నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి చెందడం పార్టీ వర్గాలను కూడా ఆశ్యర్యానికి గురిచేసింది.ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి గట్టి అభ్యర్థులు ఉన్నారు.
దీంతో ఈసారి ఎలాగైనా ఈ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రం ఎక్కాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రతిపక్షంలోనే ఉన్నా ఆయా నియోజకవర్గాల్లో ఇంకా బలంగానే ఉంది.వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కొంచెం కష్టపడితే గెలుపు కష్టమేమీ కాదని రిపోర్టులు అందుతున్నాయి.దీంతో ఈ నియోజకవర్గాల్లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్దడం, నేతల మధ్య సమన్వయలోపాన్ని అరికట్టడం వంటి చర్యలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.







