రోజులు మారాయి కానీ జనం మాత్రం మారడం లేదు.ఉచిత పథకాలు ఇస్తే తప్ప ప్రజలు ఆదరించడం లేదు.
అయితే అంతమాత్రాన ప్రజలదే తప్పు అని చెప్పడానికి లేదు.ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది.
అందుకే ప్రజలు కూడా తెలివిగా ఆలోచిస్తూ ఉచిత పథకాలను తీసుకుంటున్నారు.అయితే ఉచిత పథకాలు దేశ ఆర్ధిక వ్యవస్థకు పెనుభారంగా మారుతున్నాయన్న అపవాదు కూడా నెలకొంది.
ఏపీ లాంటి రాష్ట్రాలలో అప్పులు చేసి మరీ ఉచిత పథకాలకు లక్షల కోట్లు ఖర్చుపెడుతున్నారు.ఇది మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.శనివారం యూపీలో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ దేశంలో ఉచిత పథకాలపై తన మనసులోని మాటలను కుండబద్ధలు కొట్టారు.
ఉచిత పథకాలకు దేశానికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన కామెంట్ చేశారు.ముఖ్యంగా దేశంలోని యువత ఉచిత పథకాల మోజులో పడొద్దని సూచించారు.
దేశ ప్రగతికి ఉచితాలు గొడ్డలి పెట్టు అని అభివర్ణించారు.స్వీట్లు మాదిరిగా ఉచిత పథకాలను పంచుకుంటూ పోవడం తగదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఇటీవల ఉచిత పథకాలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది.ఇలాంటి పథకాలపై రాజకీయ పార్టీలే నిర్ణయం తీసుకోవాలని లేదా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.

మొత్తానికి ఉచిత పథకాల పేరుతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్న రాజకీయ పార్టీలను మోదీ టార్గెట్ చేశారని చెప్పవచ్చు.రాష్ట్ర బడ్జెట్‌లో 10 నుంచి 15 శాతం మేరకే ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.ఈ నిబంధనను కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తే ఉచిత హామీలకు తెర పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఉచిత హామీలు ఇచ్చి అప్పులు చేసి రాష్ట్రాలను గుల్ల చేసే పనికిమాలిన విధానాలకు కూడా ముగింపు పలికినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







