కరోనా మహమ్మారి వల్ల ప్రభావితం కాని రంగమంటూ ఏది లేదు.వైరస్ సోకి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.
ఉద్యోగాలు కోల్పోయి కోట్లాది మంది రోడ్డున పడ్డారు.వ్యాపారాలు దెబ్బతిని , అప్పుల పాలై ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇలాంటి ఘటనలు కొకొల్లలు.అయితే ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆర్ధిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు గాను స్పెషల్ ప్యాకేజీని ప్రకటించాయి.
అయితే కొందరు ఈ సాయాన్ని తమ స్వార్ధానికి వాడుకుంటున్నారు.దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆర్ధిక సాయాన్ని ఓ వ్యక్తి మద్యం తాగేందుకు ఉపయోగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళితే… యూకేలో ఈ ఘటన జరిగింది.
బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ ఫండ్‌ను కొందరు మద్యం సేవించేందుకు, జూదం ఆడేందుకు ఖర్చు చేసినట్లు సమాచారం అందడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ క్రమంలో వేల్స్ కు చెందిన భారతీయ రెస్టారెంట్ యజమాని అడ్డంగా దొరికిపోయాడు.
దీంతో అతనిని తొమ్మిదేళ్లపాటు దివాళా పరిమితుల కింద వుంచారు.కార్డిఫ్‌లోని చట్నీ రోటీ ఇండియన్ రెస్టారెంట్ ను మహేశ్ మంగ్లానంద్ అనే వ్యక్తి నడుపుతున్నాడు.
అయితే యూకే ఇన్సాల్వేన్సీ సర్వీస్ ప్రకారం.కోవిడ్ మహమ్మారి ఉద్ధృతికి ముందే రెస్టారెంట్ ను మూసివేశారు.
అందువల్ల కోవిడ్ 19 ఆర్ధిక సహాయాన్ని పొందేందుకు మహేశ్ కు ఎలాంటి అర్హత లేదు.అయితే ఏప్రిల్ 2020లో అతను స్థానిక కౌన్సిల్ కు 25,000 పౌండ్ల గ్రాంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
తర్వాతి నెలలో మరో 18,000 పౌండ్ల బౌన్స్ బ్యాక్ లోన్ కోసం మహేశ్ దరఖాస్తు చేసుకున్నాడు.

ఇదే సమయంలో 2021 జూలైలో ఆయన దివాలా కోసం దరఖాస్తు చేసుకున్నాడు.దీంతో ఇన్‌సాల్వెన్సీ సర్వీస్ కోవిడ్ 19 ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్‌ల దుర్వినియోగంపై దర్యాప్తు ప్రారంభించింది.కోవిడ్ 19 సపోర్ట్ స్కీమ్.
నిజమైన వ్యాపారులకు అండగా వుంటుందని కానీ దీనిని దుర్వినియోగం చేసేవారిని ఎట్టిపరిస్ధితుల్లోనూ వదిలేది లేదని ఇన్‌స్వాలెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు.మంగ్లానంద్ వ్యాపారాన్ని పూర్తిగా పక్కనబెట్టి మద్యానికి బానిసయ్యాడని, ఏడాదిగా జూదంలో దాదాపు 30,000 పౌండ్లు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
మంగ్లానంద్ నుంచి ఆ సొత్తును వసూలు చేసేందుకు గాను ఆయన ఆస్తులను జప్తు చేసే పనిలో ఇన్సాల్వేన్సీ అధికారులు వున్నారు.