సాధారణంగా టెడ్డీబేర్లు అనగానే పిల్లలు ఎంతో ఇష్టం చూపుతుంటారు.ఒక్కొక్కరు ఒక్కో రంగును ఇష్టపడినా, పుట్టిన రోజులు వంటి సందర్భాల్లో రకరకాల టెడ్డీబేర్లు గిఫ్టులుగా వస్తుంటాయి.
వాటిని చూసి మురిసిపోతుంటారు.ముఖ్యంగా అమ్మాయిలకు టెడ్డీబేర్లంటే ఎంతో మక్కువ.
ఏదైనా షాపుల వద్దకు తీసుకెళ్తే అది కావాలి, ఇది కావాలి అంటూ క్షణానికో టెడ్డీ బేర్ చూపి, వాటిని కొనాలని తల్లిదండ్రులను విసిగిస్తుంటారు.వారిని సంతోష పెట్టాలని తల్లిదండ్రులు కూడా అడిగిన టెడ్డీ బేర్ కొంటుంటారు.
ఇంకొన్ని సందర్భాల్లో తమ పిల్లల్లో ముఖాల్లో సంతోషం చూడడం కోసం సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇస్తుంటారు.ఇలా ఇంట్లో వారికి ప్రత్యేకంగా కేటాయించిన గదిలో ఎన్నో టెడ్డీబేర్లు ఉంటే చూడముచ్చటగా ఉంటుంది.
అయితే చిన్నారులు ఎంతగానో ఇష్టపడే టెడ్డీబేర్ల కోసం ఓ ప్రత్యేక మ్యూజియమే పెట్టేశారని మీకు తెలుసా.ఇది నిజంగానే ఓ దేశంలో పెట్టారు.
దానికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
థాయిలాండ్‌లోని పట్టాయాలో టెడ్డీ బేర్ మ్యూజియం ఉంది.
దీనికి ‘ట్రావెల్ ట్రెజర్ హంటింగ్ విత్ టెడ్డీబేర్’ అనే పేరు కూడా పెట్టారు.ఆగ్నేయాసియాలో టెడ్డీ బేర్ల కోసం తెరవబడిన మొదటి మ్యూజియం ఇది.పిల్లలు దీన్ని బాగా ఇష్టపడతారు.టెడ్డీబేర్ మ్యూజియంను సందర్శించగానే పలు రకాల ఆకారాలలో, వివిధ పరిమాణాలలో టెడ్డీ బేర్‌లు కనిపిస్తాయి.
ఎన్నో రంగుల హరివిల్లులాగా దర్శనమిస్తాయి.మ్యూజియాన్ని 12 జోన్‌లుగా విభజించారు.
మీరు “టెడ్డీస్ ఇన్ ది స్టోన్-ఏజ్” నుండి “టెడ్డీస్ ఇన్ స్పేస్” వరకు అన్ని ప్రాంతాలలో తిరుగవచ్చు.కొంత మంది కుటుంబంతో సహా విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు.
అలా వెళ్లినప్పుడు పిల్లలను ఆ మ్యూజియానికి తీసుకెళ్తే ఎంతో సంతోషిస్తారు.ఎక్కడా లేని విధంగా వైవిధ్యమైన ఎన్నో రకాల టెడ్డీబేర్లు అక్కడ దర్శనమిస్తాయి.







