వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు వివిధ దేశాలకు చెందిన వారు వలస వెళ్లారు.ఎన్నో ఏళ్ల నుంచి అగ్రరాజ్యాన్ని శక్తివంతంగా వుంచడంలో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొన్ని జాతులు అక్కడ తగిన గుర్తింపు కోసం పోరాడుతున్నాయి.ఈ క్రమంలో ఆసియా పసిఫిక్ మూలాలు వున్న వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుభవార్త చెప్పారు.
ఆసియా పసిఫిక్ అమెరికన్ హిస్టరీ అండ్ కల్చర్ మ్యూజియాన్ని నెలకొల్పేందుకు వీలు కల్పించే బిల్లుపై జో బైడెన్ సంతకం చేశారు.దీని వల్ల అమెరికాలోని భారత సంతతి ప్రజల చరిత్ర, సంస్కృతిని గుర్తించడంతో పాటు డాక్యుమెంట్ చేయడానికి వీలు కలుగుతుంది.
వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ అండ్ పసిఫిక్ అమెరికన్ హిస్టరీ అండ్ కల్చర్‌కు సంబంధించి ఏళ్లుగా పెండింగ్‌లో వున్న బిల్లుపై సంతకం చేయడం తనకు దక్కిన గౌరవమని జో బైడెన్ వ్యాఖ్యానించారు.సోమవారం వైట్ హౌస్ తూర్పుగదిలో జరిగిన సైన్ – ఇన్ వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఉద్ధేశిస్తూ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కూడా ప్రసంగించారు.ఈ సందర్భంగా తన భారతీయ మూలాల గురించి కూడా ప్రస్తావించారు.

తన తల్లికి 19 సంవత్సరాల వయసు వున్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌పై ఉన్నత విద్యను అభ్యసించేందుకు గాను ఆమె భారత్ నుంచి అమెరికాకు వచ్చారని కమలా హారీస్ గుర్తుచేసుకున్నారు.చరిత్రను బోధించడమంటే అమెరికన్లుగా మనందరం ఎక్కడి నుంచి వచ్చామో , మనం ఎవరో అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుందని వైస్ ప్రెసిడెంట్ అన్నారు. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ హిస్టరీ అండ్ కల్చర్ మన దేశ చరిత్రను బోధిస్తుందని కమలా హారీస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్, ఇండియన్ కమ్యూనిటీ ప్రముఖులు అజయ్ జైన్ భూటోరియా, కమల్ కల్సి పాల్గొన్నారు.








