ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా మరోసారి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆదివారం నాడు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉంగుటూరు మండలంలోని ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు.
వల్లభనేని వంశీమోహన్ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినా ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారు.
అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోపోయినా వైసీపీకి మద్దతు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ నేత వంగవీటి రాధాను చాలారోజుల తర్వాత వల్లభనేని వంశీ కలవడం ఆసక్తికరంగా మారింది.
వీరిద్దరూ చాలాసేపు ఏకాంతంగా చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అనంతరం వంగవీటి రాధాను వల్లభనేని వంశీ దగ్గరుండి కారు ఎక్కించడం కూడా వీరిద్దరి మధ్య బంధాన్ని చాటుతోంది.

గతంలో వంగవీటి రాధా వర్ధంతి కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు.ఆ సమయంలో విజయవాడ బందరురోడ్డులోని రంగా విగ్రహానికి వల్లభనేని వంశీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.అంతేకాకుండా వంగవీటి రంగా ఆశయ సాధనకు తాను కృషి చేస్తానని తెలియజేశారు.తాజాగా వీళ్లిద్దరూ మరోసారి కలుసుకోవడంతో వంగవీటి రాధాకృష్ణ రాజకీయ పయనం ఎటువైపు అంటూ చర్చ జరుగుతోంది.2019 ఎన్నికల ముందు వంగవీటి రాధా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు.ఎన్నికల్లో టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు.
ఆ తర్వాత ఉన్నట్టుండి ఆయన సైలెంట్ అయిపోయారు.అప్పుడప్పుడు అమరావతి రైతుల ఉద్యమం, పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
కానీ పూర్తిస్థాయిలో రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు.ఇటీవల పరిణామాలను గమనిస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీలకు సన్నిహితంగా ఉంటూ కనిపిస్తున్నారు.
దీంతో ఆయన మళ్లీ వైసీపీ గూటికి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి.







