తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ లు అధికారికంగా ఎప్పుడు పెట్టుకుంటాయో తెలియదు కానీ దీనిపై రెండు పార్టీల నాయకులు మాత్రం గజిబిజి అవుతున్నారు.స్పష్టంగా పొత్తు ఉంటుందో లేదో క్లారిటీ లేకపోవడంతో తాము ఏ విధంగా ముందుకు వెళ్లాలని విషయంలో గందరగోళానికి గురవుతున్నారు.
తెలుగుదేశం కాస్త తగ్గితే మంచిది అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలపై టిడిపి ఆలోచనలో పడింది.దీనిపై పార్టీ అధిష్టానం ఆదేశాలు లేకుండా ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఇప్పటికే అధికార ప్రతినిధి లకు ఆదేశాలు అందాయి.
ప్రస్తుతం జనసేన తో కలిసి ఎన్నికలను ఎదుర్కొంటే టిడిపి కి ఎంత వరకు కలిసి వస్తుంది ? సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేయాలి ?బిజెపి తమతో కలిసి వస్తుందా లేదా ఇలా సవాలక్ష సందేహాలు టిడిపిలో ఉన్నాయి.దీనిపై చంద్రబాబు పూర్తిగా కసరత్తు చేస్తున్నారు.
అప్పటివరకు పార్టీ నాయకులు వ్యవహారంపై స్పందించ వద్దు అంటూ అధికార ప్రతినిధులకు ఆదేశాలు వెళ్లాయి.అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది.
టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య ప్రతిసవాళ్లు మొదలైపోయాయి.జనసేన కు బలం లేని కారణంగానే టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తోందని టిడిపి నాయకులు విమర్శలు చేస్తుండగా, దీనిని జనసేన ను ఖండిస్తూ తమ ఓటు బ్యాంకు ద్వారానే ఈసారి విజయం దక్కుతుందని, టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే సత్తా లేదని జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి అని ఆ పార్టీ నాయకులు మాట్లాడుతుండగా … ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని, పవన్ ను ముఖ్యమంత్రి చేస్తేనే టీడీపీతో పొత్తుకు అంగీకరిస్తామని జనసేన నాయకులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను తెర పైకి తీసుకు వచ్చారు .

మొదటి రెండున్నరేళ్ల పాటు పవన్ ముఖ్యమంత్రిగా ఉంటారు అని, తరువాత టీడీపీకి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని సూచనను జనసేన నాయకులు తెరపైకి తీసుకు వస్తున్నారు.ఇప్పటికే బీజేపీ కి ఈ డిమాండ్ వినిపించారు.పవన్ ను ముఖ్యమంత్రి గా ప్రకటించాలని ఈరోజు ఏపీ పర్యటనకు వస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నాడ్డా ను జనసేన నాయకుడు పొతిన మహేష్ డిమాండ్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి అని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే టిడిపితో పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు .ఈ క్రమంలోనే తెరపైకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా రావడంతో రెండు పార్టీల అధినేతలు దీనిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.







