ఆన్‌లైన్ క్లాసులు వల్ల పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.ఈ క్రమంలోనే పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు వ్యసనపరులు అవుతున్నారు.
పబ్‌జీ, ఫ్రీఫైర్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వీడియో గేములను బీభత్సంగా ఆడేస్తున్నారు.అంతేకాదు సోషల్ మీడియా సైట్ కి కూడా అలవాటు పడుతున్నారు.
దీని వల్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఒక సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
వీడియో గేమ్‌లు ఆడుతున్నా, సోషల్ మీడియాలో సమయం గడిపేస్తున్నా అది పిల్లలపై సానుకూల ప్రభావమే చూపుతుందని ఈ సర్వే స్పష్టం చేసింది.ఈ సర్వేలో పాల్గొన్న చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు వీడియో గేమ్‌లు, సోషల్ మీడియా కారణంగా మానసికంగా మెరుగుపడ్డారే కానీ వెనుకబడ లేదని పేర్కొన్నారు.
అలాగే వారిలో సంతోషం కూడా రెట్టింపు అయిందని తెలిపారు.ముఖ్యంగా వారి మానసిక స్థితి బెటర్‌గా మారిందని చెప్పారు.
పిల్లల మానసిక స్థితిపై వీడియో గేమ్స్, సోషల్ మీడియా పాజిటివ్ ఎఫెక్ట్ కనబరిచిందని 40 % మంది లేటెస్ట్ సర్వేలో అభిప్రాయపడ్డారు.

ఒక్క సోషల్ మీడియా వల్లే పిల్లలపై సానుకూల ప్రభావం పడుతుందని 30% మంది తల్లిదండ్రులు పేర్కొనడం విశేషం.ఇదిలా ఉండగా స్కూల్స్ ఆన్‌లైన్, వర్చువల్ మోడ్‌లో పాఠాలు చెప్పడం మానేయాలని సర్వేలో పాల్గొన్న 100% మంది తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.ఇటీవల పియర్‌సన్ గ్లోబల్ లెర్నర్స్ నిర్వహించిన ఈ సర్వేలో అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, చైనా, భారత్ వంటి 5 దేశాల నుంచి 3100 మంది పేరెంట్స్ పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
ఈ సర్వే ఫలితాలలోనే వీడియో గేమ్‌లు, సోషల్ మీడియా వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఉందని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు తేలింది.







