కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలంటే హీరోయిన్స్ కు గట్స్ కావాల్సిందే.కమర్షియల్ సినిమాల్లో ఏదో తమకు ఇచ్చిన ఓ చిన్నపాత్రలో మెప్పించడం చాలా ఈజీ కానీ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో శభాష్ అనిపించుకోవడం అందరికి సాధ్యం కాదు.
ఇప్పుడున్న కథానాయికల్లో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది మళయాళ భామ కీర్తి సురేష్.
సొంత భాషలో సినిమాలు చేస్తున్న అమ్మడిని కిశోర్ తిరుమల తెలుగు పరిశ్రమకు తీసుకొచ్చాడు.
మొదటి సినిమా నేను శైలజతోనే యూత్ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టిన కీర్తి సురేష్ అప్పటి నుండి వరుస సినిమాలు చేస్తూ వచ్చింది.ఇక సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ నేటితరం అభినయ తారగా అవతరించింది.
నాగ్ అశ్విన్ రాసుకున్న సావిత్రి కథకు కీర్తి సురేష్ కాకుండా మరొకరైతే ఎలా ఉండేదో అన్న ఆలోచన కూడా రావడం కష్టం.
మహానటి ఇచ్చిన బూస్టింగ్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి లాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేసింది కీర్తి సురేష్.
ఆమె చేసిన ప్రయత్నాలన్ని సిన్సియర్ గా అనిపించినా ఫలితాలు మాత్రం నిరాశపరచాయి.అయితే ఫ్లాపులు వచ్చాయి కదా ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మనకెందుకు అనుకోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది.

ఈ క్రమంలో లేటెస్ట్ గా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన సినిమా సాని కాయిధం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరుణ్ మత్తేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ క్రైం రివెంజ్ మూవీ గురువారం అమేజాన్ ప్రైం లో రిలీజైంది.మహానటి తర్వాత కీర్తి సురేష్ నటన గురించి ప్రస్థావించేలా చేసిన సినిమా సాని కాయిధం.తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే మహిళ పాత్రలో ఒకటి రెండు సన్నివేశాల్లో కీర్తి సురేష్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులో చిన్ని టైటిల్ తో వచ్చింది.ఓ విధంగా ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసి మంచి పని చేశారని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమా తర్వాత వస్తున్న సర్కారు వారి పాట కూడా కీర్తి సురేష్ ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు.








