కరోనా కారణంగా గడిచిన రెండున్నరేళ్లుగా ఆంక్షల మధ్య బతుకుతున్నారు ప్రజలు.వ్యాక్సినేషన్, ఇతర చర్యల కారణంగా ఇప్పుడిప్పుడే పరిస్దితులు చక్కబడుతూ.
జీవితాలు సాఫీగా సాగుతున్నాయి.పలుదేశాలపై కొత్త వేరియంట్లు విరుచుకుపడే అవకాశం వుందంటూ హెచ్చరికలు వున్నప్పటికీ… అవి అంచనాలే అంటున్నారు నిపుణులు.
ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని, ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తే త్వరలోనే కోవిడ్ మహమ్మారి అంతమవుతుందని పలువురు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆయా దేశాలు కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్నాయి.
తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరింది సింగపూర్.
రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకున్న అంతర్జాతీయ ప్రయాణీకులను మలేషియా, థాయిలాండ్, వియత్నాం సహా ఇతర ఆగ్నేయాసియా దేశాలు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సింగపూర్ కూడా టీకాలు తీసుకున్న ప్రయాణీకులను అనుమతించేందుకు సిద్ధమవుతోంది.ఈ మేరకు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ కీలక ప్రకటన చేశారు.దేశంలో దీర్ఘకాలంగా అమల్లో వున్న కోవిడ్ 19 నిబంధనలను గణనీయంగా తగ్గించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.వీటిలో అంతర్జాతీయ ప్రయాణీకులకు అనుమతి, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం వంటి వాటిని ఎత్తివేస్తామని లూంగ్ వెల్లడించారు.

కరోనా ప్రస్తుత వేవ్ తగ్గుముఖం పట్టడంతో బహిరంగంగా గుమిగూడే వ్యక్తుల సంఖ్యను 5 నుంచి పదికి పెంచనున్నారు.అలాగే 75 శాతం ఉద్యోగుల సామర్ధ్యంతో కార్యాలయాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.మార్చి 29 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ఆయన ఓ టెలివిజన్ ప్రసంగంలో తెలిపారు.రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి సహజీవనం చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు లూంగ్ చెప్పారు.
తమ నిర్ణయం వ్యాపారాలకు, పర్యాటక రంగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన ఆకాంక్షించారు.అయినప్పటికీ కోవిడ్ పట్ల తాము అప్రమత్తంగానే వుంటామన్నారు.







