తెలుగుదేశం పార్టీ తప్పు చేసి తప్పించుకు తిరుగుతూ తిరిగి ఆ తప్పును తమపైన నెట్టాలి అని చూస్తోందని కొద్దిరోజులుగా ఆగ్రహంగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.ఇప్పుడు దాని నుంచి బయట పడడమే కాకుండా తగిన సాక్ష్యాలతో అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొనుగోలు చేసిన భూముల వివరాలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధానిగా అమరావతి ప్రకటించక ముందే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తదితరులు బినామీ పేర్లతో, తమ బంధువుల పేర్లతోనూ భారీగా భూములు కొనుగోలు చేశారని, ఆ కొనుగోలు మొత్తం పూర్తి అయిన తరువాత రాజధానిగా అమరావతిని ప్రకటించారని, అంతేకాకుండా తమకు కావలసిన వారి భూములను తప్పిస్తూ సిఐడి కూడా మార్చిందని రింగ్ రోడ్డు ఇష్టానుసారంగా మార్చాలంటూ వీడియో రూపంలో వైసిపి విమర్శలు చేసింది
అమరావతి ప్రాంతంలో మొత్తం 4070 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లుగా వీడియోలు ప్రదర్శించి మరీ వైసిపి ఆరోపించింది.కేవలం టిడిపి వారే కాకుండా ఆ పార్టీకి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న కొంత మంది అధికారులు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భారీగా లబ్ధి పొందినట్టు వైసిపి పేర్కొంది.టిడిపి సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్15.30 ఎకరాల తన కుటుంబ సభ్యుల పేరుతో కొనుగోలు చేశారని, అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి 7.5 ఎకరాలను కొన్నారని, అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో టిడిపి నాయకుడు కొమ్మలపాటి శ్రీధర్ 28.6 ఎకరాలను కొన్నట్టు పేర్కొన్నారు.అలాగే అనంతపురం జిల్లా కు చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్ఆర్ ఇన్ ఫ్రా అవెన్యూస్ పేరుపై భూములు కొనుగోలు చేశారని వివరించారు.
యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్ పేరుపై 7 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు.దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, శశి ఇన్ ఫ్రా పేరుతో 17.13 ఎకరాలు, గుమ్మడి సురేశ్ పేరుపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు, ధూళిపాళ్ల నరేంద్ర తన కుమార్తె వీర వైష్ణవి, దేవరపు పులయ్య పేరుపై 13.5 ఎకరాలు కొనుగోలు చేశారని వివరించారు.ఇక అప్పటి పురపాలక మంత్రి నారాయణ తన దగ్గర పనిచేస్తున్న వారి పేర్లపై 55.27 ఎకరాలు కొనుగోలు చేశారని వైసీపీ నాయకుల ప్రధాన ఆరోపణ .అలాగే రావెల కిశోర్ బాబు విశాఖకు చెందిన మైత్రీ ఇన్ ఫ్రా పేరుపై 40.85 ఎకరాలు, జీవీ ఆంజనేయుల బినామీల పేరుపై 53.48 ఎకరాలు కొన్నట్లు పేర్కొన్నారు.చంద్రబాబు ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ తన కుటుంబ సభ్యులపై మొత్తంగా 62.77 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు.
మాజీ ఎంపీ మురళీ మోహన్ కు చెందిన 53.29 ఎకరాలను ఇన్నర్ రింగ్ రోడ్డులోకి తీసుకొచ్చి ఆయనకు బాగా లబ్ది చేకూర్చినట్టు చెబుతున్నారు.అలాగే బాబు బాబుకి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన లింగమనేని రమేష్ తో క్విడ్ ప్రోకో కు పాల్పడ్డారని వీడియో రూపంలో విమర్శలు చేశారు.
అలాగే నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితులు చాలామందికి సీఆర్డీఏ పరిధిలో ప్లాట్లు దక్కాయని వైసీపీ ఆరోపణలు చేసింది.