అమెరికా కు కంటి మీద కునుకు లేకుండా చేసిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.అమెరికా చరిత్ర లో లాడెన్ కొట్టిన దెబ్బ ను అగ్రరాజ్యం అంత తేలికగా తీసుకోలేకపోయింది.
దీనితో అతడిని వెతికి వెతికి మరి చంపేసిన తీరు ప్రపంచానికే పాఠం చెప్పేలా భారీ వ్యూహాన్ని అమలు చేసింది.అయితే లాడెన్ వారసుడు గా అతడి కుమారుడు హమ్జ బిన్ లాడెన్ కూడా అగ్రరాజ్యానికి తలనొప్పిగా మారాడు.
దీనితో అతడిని హతమార్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి.హమ్జాను అల్ ఖైదాకు లాడెన్ వారసుడిగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అతడ్ని అమెరికా మట్టుబెట్టినట్లుగా విశ్వసనీయ సమాచారం తమ వద్ద ఉందంటూ అమెరికాకు చెందిన ఒక మీడియా సంస్థ పేర్కొనటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.అయితే గత రెండేళ్లుగా అమెరికా లాడెన్ వారసుడిని వెతికి హతమార్చేపనిలో పడిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అతడి కోసం భారీ గా జల్లెడ కూడా పడుతోంది.దానికి తోడు 2017లో హమ్జాను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా అతడి తల పైన మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.
ఇంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న అమెరికా కు హమ్జ ఆచూకీ లభించడం తో అతడ్ని హతమార్చినట్లు ఆ పత్రిక వెల్లడించింది.

లాడెన్ 20 మంది సంతానంలో హమ్జా పదిహేనోవాడు.అయితే ఇప్పుడు లాడెన్ వారసుడ్ని అగ్రరాజ్యం హతమార్చినట్లు వస్తున్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది.అయితే ఈ వార్త పై అమెరికా అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.








