పార్టీ మారే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా గందరగోళంలో పడిపోయినట్టు కనిపిస్తోంది.కాంగ్రెస్ లోనే ఉండాలా లేక బీజేపీలోకి వెళ్లాలా అనే విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేక కన్ఫ్యూజన్ అవుతున్నట్టు అర్ధం అవుతోంది.
గురువారం ఉదయం జరిగిన సీఎల్పీ సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు.ఆలస్యంగా అసెంబ్లీకి వచ్చారు.
సభలో కాంగ్రెస్ సభ్యులతో కూర్చున్నా సభలో కాంగ్రెస్ చేస్తున్న నిరసనల్లో మాత్రం ఆయన పాల్గొనలేదు.సభలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసిన సందర్భంలోనూ వారితోపాటు వాకౌట్ చేయలేదు.
కానీ సభ వాయిదా పడ్డాక మాత్రం స్పీకర్‌ను కలిసేందుకు కాంగ్రెస్ సభ్యులతో కలిసి వెళ్లారు.

బీజేపీలోకి ఆయన రేపో మాపో వెళ్ళిపోతారు అని అంతా అనుకుంటున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా మాట మార్చారు.బీజేపీలోకి వెళ్తానని తాను ఎప్పుడూ చెప్పలేదు అంటూ బాంబ్ పేల్చారు.అంతే కాదు తాను ఎలాంటి టర్న్‌లు తీసుకోలేదని, ఇప్పటికీ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని అన్నారు.
కాంగ్రెస్ నాయకత్వం తప్పులు చేస్తోందన్న బాధ, ఆవేదనతోనే టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమని చెప్పను తప్ప పార్టీ మారే ఉద్దేశమే తనకు లేదన్నారు.అస్సలు తనకు బీజేపీలోకి రావాలని ఇప్పటివరకు ఆహ్వానమే అందలేదు అంటూ రాజగోపాల్ రెడ్డి అన్నారు.
తనను పార్టీలో కొనసాగాలని ఓ కార్యకర్త సూచించారని, ఆ కార్యకర్తకు అండగా మాట్లాడితే దాన్ని మీడియా తప్పుగా అర్ధంచేసుకుందన్నారు.

తెలంగాణాలో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనీ టీఆర్ఎస్ చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.అందరినీ కలుపుకొని వెళ్లడంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా విఫలయ్యారని తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను కూడా ఉద్యమం చేస్తానని పేర్కొన్నారు.తనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానికి సిద్ధంగా ఉన్నానంటూ రాజగోపాల్ రెడ్డి అన్నారు.
అదే సమయంలో దేశంలో అంతా మోడీ హవా నడుస్తోందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.ఆయన వ్యవహారం అంతా చూస్తుంటే ఆయన అటు బీజేపీలోకి వెళ్లలేక, కాంగ్రెస్ లో ఉండలేక సతమతం అవుతున్నట్టు అర్ధం అవుతోంది.
మరికొద్ది రోజుల్లో ఈ వ్యవహారంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
.







