చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది.జరిగిందేదో జరిగిపోయింది ఇకపై జరగాల్సిందేంటో చూద్దాం ! అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఓటమి చెందిన ‘కాపు’ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తాజాగా వారంతా చంద్రబాబు తో భేటీ అయ్యి తమ బాధను అయన ముందు వ్యక్తం చేసారు.గతంలోనే రెండు పర్యాయాలు కాకినాడ, విజయవాడలలో మీటింగ్ పెట్టుకున్న ఈ కాపు నాయకులంతా తాజాగా చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా అనేక అంశాలకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకున్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రస్తావన కొంతమంది తీసుకొచ్చారు.
ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లి ఉంటే చాలా బాగుండేదని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

జనసేన ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు స్వల్ప ఓటింగ్ తేడాతో ఓడిపోయిన అంశాన్ని కొంతమంది నాయకులు ప్రస్తావించారు.అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు కేవలం 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోవడంలో కూడా జనసేన ఎఫెక్ట్ ఉందని కొంతమంది అభిప్రాయపడ్డారు.జనసేన, టీడీపీ వేరు వేరుగా పోటీచేయటం వలన తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఓట్లు చీలిపోయాయని కొంతమంది తమదైన శైలిలో విశ్లేషించారు.
ఈ పరిణామం వలన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా ఘోరంగా దెబ్బతిందని కాపు నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

తామంతా తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరబోతున్నాము అనే వార్తల్లో నిజం లేదని వారు క్లారిటీ ఇచ్చారు.అసలు తెలుగుదేశం పార్టీ కాపుల సంక్షేమం కోసం ఎంతగానో కృషిచేసిందని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ వారి సంక్షేమం కోసం సంవత్సరానికి వెయ్యి కోట్లు కేటాయించిందని, అయినా కాపుల నుంచి టీడీపీకి ఆదరణ ఎందుకు కరువయ్యిందో అర్థంకాలేదని కొంతమంది ఈ సందర్భంగా చర్చించారు.అయితే కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం మొదలుపెట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో కఠినంగా వ్యవహరించి కాపుల ఆగ్రహానికి గురయ్యామని, కాపుల కోసం ఎంత చేసినా అందుకే ప్రయోజనం లేకుండా పోయిందని ఈ సందర్భంగా కొంతమంది అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.







