ఏపీ సీఎం జగన్ రాజకీయంగా వేస్తున్న ఎత్తులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.తెలుగుదేశం పార్టీ మీద డైరెక్ట్ గా ఎటాక్ ప్రారంభిస్తే రాజకీయంగా విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో తెరవెనుక ఆ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నలు ముమ్మరం చేసినట్టు కనిపిస్తోంది.
అది కూడా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా అయితే రాజకీయం నడిపించాడో అదేవిధంగా ఇప్పుడు జగన్ కూడా రాజకీయం నడిపించి టీడీపీని ఇరుకునపెట్టాలని చూస్తున్నాడు.గతంలో చంద్రబాబు నాయుడుకు చెక్ చెప్పడానికి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరిని వాడారు.
పురంధేశ్వరిని ఏకంగా కేంద్ర మంత్రిని చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.

ప్రస్తుతం జగన్ కూడా నందమూరి కుటుంబాన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రోత్సహించేందుకు సిద్ధం అవుతున్నాడు.దీనికి సంబంధించి జగన్ దగ్గర మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.లక్ష్మీపార్వతి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ చంచురామ్.2014 ఎన్నికల తరువాత లక్ష్మీపార్వతి అల్లుడి మీద పగతో వైసీపీలో చేరారు.పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం, తరచూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని తిట్టడం చేసే వారు.
ప్రకాశం జిల్లా పర్చూరు స్థానం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేశారు.వాస్తవానికి ఈ సీటును ఆయన కుమారుడు హితేష్ ఆశించినా, పౌరసత్వం విషయంలో తలెత్తిన సమస్యతో అది ఆయనకు దక్కకపోవడంతో వెంకటేశ్వరరావు పోటీ చేశారు.
అయితే ఆయనపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు.దగ్గుబాటి గెలిస్తే ఆయనను స్పీకర్ ను చేసి బాబు చేత అధ్యక్షా అనిపించాలన్న జగన్ కోరిక తీరలేదు.
అయితే చంద్రబాబు ని ఇరుకున పెట్టే ఉద్దేశంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గానీ హితేష్ కు గానీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఆ తరువాత వారికి మంత్రి పదవి కూడా కేటాయించే అవకాశం ఉన్నట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది.
ఇక లక్ష్మి పార్వతి విషయానికి వస్తే దగ్గుపాటి కుటుంబానికి ఆ పదవులు దక్కకపోతే ఈమెకు ఎమ్యెల్సీగా అవకాశం ఇద్దామనే ఆలోచనలో జగన్ ఉన్నాడట.ఏది ఏమైనా చంద్రబాబు ను ఆయన సొంత కుటుంబం ద్వారానే ఇబ్బందిపెట్టాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.







